
మహబూబాబాద్/గూడూరు: టీఆర్ఎస్ పాలనలో బడులు, కొలువులు బంద్ అయ్యాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పాలన చేతకాకపోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని.. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో షర్మిల పరామర్శించారు. అనంతరం గుండెంగా క్రాస్ రోడ్డు వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.
5 నెలలైనా ఆదుకోరా?
సునీల్ చనిపోయి 5 నెలలైనా ఆ కుటుంబాన్ని రాష్ట్ర సర్కార్ ఆదుకోలేదని షర్మిల ఫైర్ అయ్యారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ అహంకారాన్ని దించే వరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.