మంత్రులు, ఎమ్మేల్యేలపై షర్మిల ఫైర్

మంత్రులు, ఎమ్మేల్యేలపై షర్మిల ఫైర్
  • భూకబ్జాలు, అవినీతిపై ప్రశ్నిస్తే ఉలికిపాటెందుకు?  
  • ఇదేదో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడంపై చూపాలని చురకలు

జడ్చర్ల, వెలుగు: మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన కామెంట్లకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు. ‘‘నన్ను మరదలు అని అన్న వ్యక్తిని ఏమనాలో చెప్పండి. మానవత్వం మరిచి అవమానించేలా మాట్లాడిన మంత్రికి చెప్పుతో కాకుండా దేనితో బుద్ధి చెప్పాలో చెప్పండి..” అని ఆమె ప్రజలను అడిగారు. శుక్రవారం ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌక్ లో ఆమె మాట్లాడారు. ‘‘జిల్లా మంత్రులు, ఎమ్మేల్యేలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తే నా నోరు నొక్కేందుకని అసెంబ్లీ స్పీకర్ ను కలిసి కంప్లయింట్ చేయడం చూస్తుంటే నేను అసెంబ్లీలోకి కాలు పెట్టకముందే మంత్రులు, ఎమ్మేల్యేలతో పాటు సీఎం కేసీఆర్ ఉలికిపడుతున్నట్లుగా ఉంది” అని ఆమె ఎద్దేవా చేశారు.

మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సిగ్గులేకుండా తనపై కంప్లయింట్ చేసేందుకు ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఇదే ప్రయత్నం  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు చేస్తే బాగుండేదన్నారు. సీఎం కేసీఆర్ కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై లేదన్నారు. జిల్లా మంత్రులు తమ భూములను కబ్జా చేస్తున్నారని అనేక మంది పేద రైతులు తనకు చెప్పారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి ఒక దొంగ, బ్లాక్ మెయిలర్ అని ఘాటుగా విమర్శించారు. ఆయన కేసీఆర్ చేతిలో కీలు బొమ్మ అని, ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేవంత్, కేసీఆర్ ఫ్యామిలీకి కూడా లింకులు ఉన్నాయని ఆరోపించారు.