కడప నుంచి షర్మిల పోటీ!: ఇవాళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

కడప నుంచి షర్మిల పోటీ!: ఇవాళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

న్యూఢిల్లీ, వెలుగు :  కడప అసెంబ్లీ స్థానం నుంచి షర్మిలను బరిలో నిలపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ (సీఈసీ) కమిటీ సమావేశం జరిగింది. దీనికి సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరుకాగా..  ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రఘువీరా రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా...  వీటిలో 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.

114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితా మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. సీఈసీ మీటింగ్ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఏపీలో పింఛన్ పంపిణీ విషయాన్ని రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు. డైరెక్ట్ బెనిఫిట్ ఆప్షన్(డీబీటీ) ద్వారా పింఛన్ పంపిణీ చేయాలని ఈసీఐ  ఆదేశించిందన్నారు. కానీ ఏపీ సీఎస్ ఇందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.