దీక్ష పర్మిషన్ కోసం  హైకోర్టుకు షర్మిల

దీక్ష పర్మిషన్ కోసం  హైకోర్టుకు షర్మిల

హైదరాబాద్, వెలుగు : టీ సేవ్ ఫోరం ఆధ్వర్యంలో టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై వైఎస్సార్​టీపీ నిర్వహించాలనుకున్న దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లేందుకు పార్టీ చీఫ్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం లోటస్​పాండ్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో పార్టీ పీఏసీ మెంబర్ గట్టు రామచంద్ర​రావు మాట్లాడారు. దీక్ష కోసం వారం కింద పోలీసులకు అప్లికేషన్ పెట్టుకున్నామని తెలిపారు. సోమవారం దీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆదివారం దాకా పెండింగ్​లో పెట్టారని, ట్రాఫిక్ ఇబ్బందిని సాకుగా చూపించి పర్మిషన్ ఇవ్వలేదన్నారు.

టీ సేవ్ పేరుతో నిరుద్యోగుల తరఫున అందరినీ కలుపుకొని పోరాటం చేస్తున్నామని వివరించారు. పోలీసులు మాత్రం ఆంక్షలు విధించడం దారుణమని మండిపడ్డారు. దీక్ష మాత్రం ఆపేది లేదని, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. టీ సేవ్​ ఫోరంకు 39 సంఘాల మద్దతు ఉందని ప్రకటించారు. పోలీసులతో ప్రతిపక్షాల ఆందోళనలను ప్రభుత్వం తొక్కిపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. అధికార పార్టీ ఎన్నిసార్లు అయినా దీక్షలు, ధర్నాలు చేయొచ్చని, ప్రతిపక్షాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో, ఢిల్లీలో బీఆర్ఎస్​ లీడర్లు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని, వారికి లేని ఆంక్షలు ప్రతిపక్షాలకు ఎందుకు అని ప్రశ్నించారు. అధికార పార్టీకో న్యాయం, ప్రతిపక్షాలకో న్యాయమా? అని నిలదీశారు. తమను పార్టీ ఆఫీస్​ నుంచి బయటికి రానివ్వడం లేదని, నేతలు, మీడియా వచ్చినా లోటస్​పాండ్​లోకి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారన్నారు.