పేద ప్రజల కోసం YSR ఆరోగ్యశ్రీ

పేద ప్రజల కోసం YSR ఆరోగ్యశ్రీ

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందన్నారు. అంతేకాదు చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, వడదెబ్బకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. వైద్య రికార్డులన్నీ భద్రపరిచేలా కొత్తగా క్యూ ఆర్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద 2059 వైద్య సేవలు అందుతాయన్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా 1.42కోట్ల ఆరోగ్య శ్రీ కార్డులు అందజేసినట్లు తెలిపారు. 300 ఇళ్లకు ఒక ఆశా వర్కర్ ఉంటారన్నారు. గ్రామ సచివాలయాలతో ఆశావర్కర్లు అనుసంధానంగా పనిచేస్తారన్నారు. విశ్రాంతి సమయంలోనూ రోగులకు రూ.5వేలు సాయం చేస్తామన్నారు.

అంతేకాదు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.  డయాలసిస్ చేయించుకునే వారికి రూ.10వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పక్షవాతంతో బాధపడే వారికి రూ.5వేల పెన్షన్ వస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మూడేళ్లలో దశలవారీగా మార్పు చేస్తామన్నారు. 5వేల సబ్ సెంటర్లలో ఫిబ్రవరి 1న నాడు-నేడు ప్రారంభమవుతుందన్నారు.

ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్మికుల జీతం రూ.16వేలకు పెంచినట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్చికల్లా 108, 104 కొత్త వాహనాలు వస్తాయన్నారు. ఏపీలో ఆరోగ్య శ్రీ కింద మరిన్ని వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య రంగంలోనే వైఎస్ ఒక విప్లవానికి నాంది పలికారని, ఇప్పుడు దాని కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్ కు పూర్తి వైద్యం అందుతుందన్నారు సీఎం జగన్.