అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి

అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి

కడప: బద్వేలు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడపలోని నాగరాజుపేట అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యే కాకముందు ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. ఆయన 2016లో బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో అద్భుత విజయం సాధించాడు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటు అని ఆయన అన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.  వెంకట సుబ్బయ్య పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారని మంత్రి అన్నారు. 

నివాళులర్పించిన సీఎం జగన్

కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్ నివాళ్ళు అర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి  చేరుకున్న సీఎం రోడ్డు మార్గాన నగరంలోని కో ఆపరేటీవ్ కాలనీలో బద్వేల్ ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య  భౌతికకాయం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఓదార్చి దైర్యాన్ని ఇచ్చారు. సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఎస్పీ అన్బురాజన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నివాళ్ళు అర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విద్యా శాఖ మంత్రి ఆడిములపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ఉన్నారు. నివాళులర్పించిన అనంతరం సీఎం జగన్ కడప విమానాశ్రయానికి చేరుకోని ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరి వెళ్లారు.