బాలకృష్ణకు అంతసీన్ లేదు

బాలకృష్ణకు అంతసీన్ లేదు

ఇటీవల హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా   తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని బాలకృష్ణ వైసీపీ కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు తన పర్యటనను అడ్డుకోవడంపై మండిపడ్డ బాలయ్య..  తాను సైగ చేస్తే పరిస్థితి ఏమయ్యేదని హెచ్చరించారు.

అంతేకాదు మంత్రులకు అవగాహన లేక అసెంబ్లీలో గొడవ పడుతున్నారని, తాము చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనబడుతుందన్నారు బాలకృష్ణ.  కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతోందని,  రాష్ట్రంలో రివర్స్‌ పాలన సాగుతుందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయాలి? ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అనే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని అన్నారు. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకేచోట ఉంటుందని తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమన్నారు.

అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. బాలకృష్ణ మాటలకు విలువలేదన్నారు.  హిందుపురం ఘటనపై సినిమా డైలాగులు చెప్పారని అన్నారు. అంతమాత్రాన ఆయన పవర్ ఫుల్ వ్యక్తి కాదని అన్నారు సురేష్ . వాళ్ల నాన్నగారు దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కున్న వారి బావ చంద్రబాబు దగ్గర నుంచి ఒక మంత్రి పదవి కూడా సంపాదించలేక పోయారని చెప్పారు.  టీడీపీలో అసలు బాలకృష్ణకు విలువే లేదని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ – బీజేపీ వ్యవహారంపై స్పందించారు. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా పవన్  కాపాడుకోలేక పోయారని ఎద్దేవా చేశారు సురేష్ . జనసేన అధినేతగా రెండు చోట్ల పోటీ చేసి సామాన్యులపై పవన్ కల్యాణ్ ఓడిపోయారన్నారు. వచ్చే నాలుగేళ్లలోనే బీజేపీలో జనసేనను విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. అలాగే శాసన మండలి రద్దు ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా రద్దు అవుతుందని ఎంపీ సురేశ్ చెప్పారు.