
- ప్రధాని మోదీ కేసీఆర్ ను కాపాడుతున్నారు
- అందుకే కేసుల్లేవ్.. అరెస్టులు లేవు
- రేవంత్ ను రేటెంత రెడ్డి అంటున్నారు!
- మద్దతు ప్రకటించినా.. ఆ పార్టీ రెస్పాండవలేదు
- అయినా నేనేం ఫీలవడం లేదు: షర్మిల
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇవాళ లోటస్ పాండ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. తాను అన్ని ఆధారాలను సమర్పించానని చెప్పారు. తాను చెప్పినట్టుగానే ప్లానింగ్, డిజైనింగ్ లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. కమీషన్ల కోసమే 38 వేల కోట్ల ప్రాజెక్టును లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం సాగుపై హరీశ్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని తెలిపారు. ఇతర ప్రాజెక్టుల సాగు లెక్కలను కలిసి తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. మేడిగడ్డ డ్యామేజీపై సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఇంత అవినీతి జరుగుతుంటే మోదీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రతి ఏటా అప్పు వాయిదాలు, వడ్డీలు, కరెంటు బిల్లులు 20 వేల కోట్లపైనే అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెల్ల ఏనుగులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం ఓపెన్ గానే మద్దతిస్తుంటే బీజేపీ మాత్రం రహస్య మిత్రుడిలా పనిచేస్తుందని విమర్శించారు. రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరం, కేసీఆర్, మెగా కృష్ణారెడ్డిపై విచారణ చేయాలన్నారు. భారీ అవినీతి బయటపడుతుందని చెప్పారు.