యూత్​ను మత్తులో ముంచుతున్నరు

యూత్​ను మత్తులో ముంచుతున్నరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతను కేసీఆర్ మద్యం మత్తులో ముంచేస్తున్నారని వైఎస్సార్​టీపీ చీఫ్ ​షర్మిల మండిపడ్డారు. ‘‘కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలపై అత్యాచారాలు 300 శాతం పెరిగిపోయాయి. మద్యమే దీనికి కారణం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. గల్లీకో బారు, వీధికో వైన్ షాప్! రాష్ట్రంలో స్కూళ్లు ఎన్నున్నాయి? బార్ షాపులు ఎన్నున్నాయి? గుళ్లు ఎన్నున్నాయి? వైన్ షాపులు ఎన్నున్నాయి? 2015లో రూ.10 వేల కోట్లున్న రాష్ట్ర మద్యం ఆదాయం 20-21 నాటికి రూ.28 వేల కోట్లకు పెరిగింది. అంటే 300 శాతం పెరుగుదల!’’ అంటూ విమర్శించారు. ‘‘వాళ్లు తాగుబోతులు. పబ్లిక్​ను కూడా తాగుబోతులను చేయాలని చూస్తున్నారు” అని కామెంట్ చేశారు. ఇది బంగారు తెలంగాణో, బర్ బాద్ అవుతున్న తెలంగాణో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. గురువారం లోటస్ పాండ్​లో షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘సింగరేణి కాలనీలో చిన్నారిపై రేప్, మర్డర్ జరిగి వారమైనా రేపిస్టును పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇది కేసీఆర్ వైఫల్యమే. నేను నిరసన దీక్ష చేశాకే ప్రభుత్వంలో చలనం వచ్చింది. అసమర్థ ప్రభుత్వం, పోలీసులు చేయని న్యాయం చివరికి ఆ దేవుడే చేశాడు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న మమ్మల్ని అర్ధరాత్రి దాటాక జనాల్లేని వేళ దొంగల్లా వచ్చి లాక్కెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు” అంటూ దుయ్యబట్టారు. ‘‘రేపిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ తప్పుడు ట్వీట్‌ చేసిన కేటీఆర్​ను మన నెత్తిమీద పెట్టి రుద్దుతున్నరు’’ అని విమర్శించారు. ‘‘రేపిస్టును పట్టుకుంటే రూ.10 లక్షలని ప్రకటించిన ప్రభుత్వం, బాధిత కుటుంబానికి ఇచ్చేది రూ.20 లక్షలేనా? ఇదీ ఓ న్యాయమేనా?  అని షర్మిల 
ప్రశ్నించారు.