
హైదరాబాద్: నిరుద్యోగ సమస్య విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబులు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కేసీఆర్ స్పందించడం లేదంటే ఆయనది గుండెనా? బండ రాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల తరఫున నిరసన గళం వినిపించేందుకు తాను చేస్తున్న మంగళవారం దీక్షను కేటీఆర్ అదో వ్రతం అని కామెంట్స్ చేయడంపై షర్మిల మండిపడ్డారు. తాను వారంలో ఒక రోజు వత్రం చేస్తున్నానని, అలానైనా ఉద్యోగాలు వస్తే సంతోషమని, మరి పెద్ద మొగోడు అయిన ఆయన ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
‘‘నేను వారంలో రోజూ ఏదో ఒక వ్రతం చేస్తానని.. నన్ను, నా పార్టీని పట్టించుకోనవసరం లేదని కేటీఆర్ అన్నారట. ఇంతకీ కేటీఆర్ ఎవరు? ఓ కేసీఆర్ కొడుకా. కేసీఆర్ మహిళలను గౌరవించరు. అలాంటిది ఆయన కొడుకు కేటీఆర్ మహిళలను గౌరవిస్తారని ఎలా అనుకోవాలి? టీఆర్ఎస్‌లో ఎంతమంది మహిళలు మంత్రులుగా ఉన్నారు? కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండేవాళ్లు, వ్రతాలు చేసుకునేవాళ్లు. నేను ఆడదాన్నే. నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి వ్రతం చేస్తున్నా. మరి కేటీఆర్ పెద్ద మొగోడు కదా.. ఆయన ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ భర్తీ చేస్తే.. నా వ్రతం ఫలించింది అనుకుంటా. అలాగే పెద్ద మొగోడు కదా సాధించాడు అనుకుంటా. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో తమ పాత్ర పొషించడంలేదు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని బీజేపీ లీడర్ చెప్పారు. మరి ఎందుకు బయటపెట్టడంలేదు. వాళ్లందరూ కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్‌ఎస్‌కు మొత్తం అమ్ముడుపోయింది. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు అపోజిషన్ పార్టీ లేకుండా అయింది. ఇప్పుడు మా పార్టీ రాకతో టీఆర్ఎస్‌కు అపోజిషన్ పార్టీ వచ్చినట్లయింది. కేసీఆర్ ఓ డిక్టేటర్. ఆయనను ఎవరూ ప్రశ్నించొద్దు అనుకుంటాడు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎవరి జేబులు నింపాడో కేసీఆర్ తెలియాలి. సీఎంగా కేసీఆర్ ఫెయిలయ్యారు. నిరుద్యోగ భృతి కోసం 54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి” అని షర్మిల అన్నారు.