మాన్​సూన్ స్టార్టర్స్.. యమ్మీ.. యమ్మీగా

మాన్​సూన్ స్టార్టర్స్.. యమ్మీ.. యమ్మీగా

ఒకవైపు చల్లని చిరుజల్లులు కురుస్తుంటే.. మరోవైపు వేడి వేడిగా, కరకరలాడే నాన్ వెజ్​ స్టార్టర్స్ ఎదురుగా ఉంటే ఎలా ఉంటుంది? బ్యాక్​ గ్రౌండ్​లో ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా...’ అంటూ మ్యూజిక్​ పడాల్సిందే. ఇంకెందుకాలస్యం... మాన్​సూన్​ని మస్త్​గా ఎంజాయ్​ చేయాలంటే.. ఈ స్టార్టర్స్​ తప్పకుండా ట్రై చేయండి.

దిల్​కుష్ చికెన్

 

కావాల్సినవి :చికెన్ (బ్రెస్ట్​ పీస్​) - పావు కిలో
క్రీమ్ - ఐదు టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి - ఒక్కోటి టీ స్పూన్ చొప్పున
ఉప్పు - సరిపడా
వెన్న - ఒక టేబుల్ స్పూన్
చీజ్ తరుగు - ఒక కప్పు
ఎండు మిర్చి తునకలు - ఒక టీస్పూన్
తయారీ :చికెన్​ బ్రెస్ట్​ పీస్​ని సన్నటి పొరలుగా కట్​ చేయాలి. ఆ తరువాత వాటిని చపాతీ కర్రతో నెమ్మదిగా కొట్టాలి. ఒక గిన్నెలో క్రీమ్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కట్​ చేసిన చికెన్​ పొరలకు పూసి, ఇరవై నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో చీజ్, పచ్చిమిర్చి తరుగు పెట్టి రోల్ చేయాలి. ఊడిపోకుండా రోల్​మీద టూత్​ పిక్​ గుచ్చాలి. పెనం మీద వెన్న వేడి చేసి తయారుచేసిన చికెన్​ రోల్స్​ని కాల్చాలి. టూత్​ పిక్ తీసేసి, రెండోవైపు కూడా కాల్చాలి. తరువాత పైన చీజ్​ తరుగు చల్లి మూత పెట్టాలి. ఐదు నిమిషాలు ఉడికిస్తే దిల్​కుష్​ చేసే చికెన్​ స్టార్టర్ రెడీ.

ఫిష్​ కోలివడ

కావాల్సినవి :చేప ముక్కలు (ముళ్లు లేనివి) - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
కారం - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి, ఉప్పు - ఒక్కోటి అర టీ స్పూన్ చొప్పున
పసుపు, వాము - ఒక్కోటి పావు టీ స్పూన్ చొప్పున
శనగపిండి, బియ్యప్పిండి - ఒక్కోటి రెండు టీస్పూన్ల చొప్పున
బేకింగ్​ సోడా, చాట్ మసాలా - చిటికెడు
నూనె - సరిపడా

తయారీ :ఒక గిన్నెలో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. పావుగంట తర్వాత అందులో శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఆ తర్వాత నూనె వేడి చేసి అందులో చేప ముక్కల్ని ఐదు నిమిషాలు వేగించాలి. చివరిగా చాట్ మసాలా, కొంచెం కారం చల్లి తింటే ఆ మజానే వేరు.  

క్రిస్పీ మటన్

కావాల్సినవి :మటన్ (బోన్​లెస్) - అరకిలో
నీళ్లు, నూనె - సరిపడా
పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ధనియాల పొడి, జీలకర్ర పొడి, 
చాట్​ మసాలా, గరం మసాలా - ఒక్కోటి ఒక్కో టీస్పూన్​ చొప్పున
కారం, ఉప్పు, పసుపు, ధనియాలు - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
శనగ పిండి, బియ్యప్పిండి, పెరుగు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - అర కప్పు
నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టీస్పూన్ చొప్పున

తయారీ :కుక్కర్​లో మటన్​, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు పోయాలి. కుక్కర్​ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెజర్​ పోయాక మూత తీసి విడిగా మరికాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్​ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో మటన్​ ముక్కల్ని వేగించాలి.

ప్రాన్​ స్టిక్స్

కావాల్సినవి :రొయ్యలు - 350 గ్రాములు
నిమ్మరసం - అర టీస్పూన్
చాట్ మసాలా, గరం మసాలా, 
పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి​ - 
ఒక్కోటి అర టేబుల్ స్పూన్ చొప్పున
కార్న్​ ఫ్లోర్, మైదా - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, కోడిగుడ్డు - ఒకటి
నూనె, ఉప్పు, బ్రెడ్​ క్రంబ్స్, కార్న్​ ఫ్లేక్స్ - సరిపడా
తయారీ : రొయ్యల్ని శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి​ వేసి కలపాలి. పది నిమిషాల తర్వాత పసుపు, కార్న్​ ఫ్లోర్, మైదా, కోడిగుడ్డు కూడా వేసి బాగా కలపాలి. వాటిని పుల్లలకు గుచ్చి, బ్రెడ్​ క్రంబ్స్, కార్న్​ ఫ్లేక్స్ మిశ్రమంలో దొర్లించాలి. ఆ తర్వాత వాటిని వేడి నూనెలో వేసి వేగించాలి.

బటర్ గార్లిక్ ఫిష్​ 

కావాల్సినవి :చేప ముక్కలు (ముళ్లు లేనివి) – ఆరు, 

ఉప్పు – సరిపడా

మిరియాల పొడి – ఒక టీస్పూన్
వెన్న – నాలుగు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్
ఎండు మిర్చి తునకలు – ఒక టీస్పూన్, మైదా – అర కప్పు
నిమ్మరసం – రెండు టీస్పూన్లు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో చేపముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. పావుగంట తర్వాత మైదా పిండిలో ఒక్కో చేప ముక్కని దొర్లించాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. తరువాత చేప ముక్కల్ని వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత మరో పాన్​లో వెన్న వేడి చేసి వెల్లుల్లి తరుగు వేగించాలి. అందులో మిరియాల పొడి, రెండు టీస్పూన్ల మైదా, నిమ్మరసం, ఎండు మిర్చి తునకలు, కొత్తిమీర వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి.