
ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్లు అందరూ ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, తమిళనాడు, కోల్ కతా నుంచే ఎక్కువ మంది ఉండేవారు. ఎన్ని తరాలు మారినా ఈ నాలుగుకు రాష్ట్రాల క్రికెటర్లు క్రికెట్ లో తమ ఆధిపత్యం చూపించేవారు. అయితే ప్రస్తుతం పంజాబ్ నుంచి యంగ్ క్రికెటర్లు దూసుకొస్తున్నారు. టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ ఏకంగా టెస్ట్ కెప్టెన్ పగ్గాలు చేపడుతున్నాడు. అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ టీ20 క్రికెట్ లో అదరగొడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రాష్ట్రానికి చెందిన యువ క్రికెటర్లకు ఒక సలహా ఇచ్చాడు.
శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ తమ ఖాళీ సమయంలో ఎక్కువ గోల్ఫ్ ఆడాలని యువరాజ్ సింగ్ కోరుకుంటున్నాడు. ఈ భారత మాజీ ఆల్ రౌండర్ గోల్ఫ్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైన క్రీడ అని చెప్పాడు. పేలవమైన ఫామ్ నుండి బయటపడటానికి 'అతిగా ప్రాక్టీస్' చేయడానికి బదులుగా గోల్ఫ్ ఆడితే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ లెజెండ్ కావడంతో తన రాష్ట్రానికి చెందిన గిల్, అభిషేక్‌లకు యువీ ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
"వారికి సమయం సమయం దొరకడం చాలా కష్టం. ఇప్పుడు వారు క్రికెట్ లో సూపర్ స్టార్లు. వారు మెరుగ్గా ఉండటానికి ఏది సహాయపడుతుందో వారు నిర్ణయించుకోవాలి. గోల్ఫ్ ఆడమని నేను చెబుతాను. ఇది మనసుకు చాలా మంచిది. రెస్ట్ తీసుకోవడానికి సరైన మార్గం. నేను గోల్ఫ్ ఆది ఉండి ఉంటే ఇంకా 3,000 పరుగులు చేసి ఉండేవాడిని. యువ క్రికెటర్లందరికీ గోల్ఫ్ ఆడటానికి ప్రయత్నించండి". అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగబోతుంది. ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీకి అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. మరోవైపు గిల్ వైస్ కెప్టెన్ కావడంతో మరో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.