Yuzvendra Chahal: రోజుకు రెండు గంటలే పడుకునేవాడిని.. ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి: చాహల్

Yuzvendra Chahal: రోజుకు రెండు గంటలే పడుకునేవాడిని.. ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి: చాహల్

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీ వర్మ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ తొలి సారి ఈ విషయంపై స్పందించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకుల సమయంలో తనపై వచ్చిన మోసం ఆరోపణలతో పాటు వారి ఐదేళ్ల దాంపత్యంలో ఏమి జరిగిందో, తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఈ టీమిండియా స్పిన్నర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 

చాహల్, ధనశ్రీ 2020 లో వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన మూడో సంవత్సరం నుంచే వారి మధ్య విబేధాలు వచ్చాయి. 35 ఏళ్ల చాహల్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రాజ్ షమానీతో మాట్లాడుతూ.. తన ఎమోషన్స్ షేర్ చేసుకున్నాడు. " నా విడాకులు జరిగినప్పుడు, ప్రజలు నన్ను మోసగాడినని ఆరోపించారు. నేను నా జీవితంలో ఎప్పుడూ మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి మీకు దొరకడు. నేను ఎల్లప్పుడూ నా సన్నిహితుల కోసం నా హృదయం నుండి ఆలోచిస్తాను. నేను డిమాండ్ చేయకుండా ఇవ్వడానికే ప్రాధ్యాన్యమిస్తాను. ప్రజలకు ఏమీ తెలియకపోయినా వారు నన్ను నిందిస్తూనే ఉంటారు".

"మోసగాడు అని నన్ను అన్నప్పుడు నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. నా జీవితంతో విసిగిపోయాను. నేను 2 గంటలు ఏడ్చేవాడిని. రోజులో 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. 40-45 రోజుల పాటు ఈ నరకం కొనసాగింది. నేను క్రికెట్ నుండి విరామం కోరుకున్నాను. క్రికెట్ పై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నా స్నేహితుడితో ఆత్మహత్య ఆలోచనలను షేర్ చేసుకునే వాడిని. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి వారితో పెరిగాను కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు.  ఎందుకంటే నా తల్లిదండ్రులు వారిని ఎలా గౌరవించాలో నాకు నేర్పించారు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి నేను నా జీవిత పాఠాలు నేర్చుకున్నాను". 
 
"సంబంధం అనేది రాజీ లాంటిది. ఒకరు కోపంగా ఉంటే, మరొకరు వినాలి. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల స్వభావం సరిపోలదు. నేను ఇండియా తరపున ఆడుతున్నాను. ఆమె కూడా కలిస్ ఉండడానికి సిద్ధంగా లేదు. ఇది 1-2 సంవత్సరాలుగా కొనసాగుతోంది". అని చాహల్ ఎమోషనల్ అయ్యాడు.