
కొలంబో: శ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ జట్టును కరోనా బెడద వీడటం లేదు. ఇప్పటికే ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కొవిడ్ సోకింది. కృనాల్‌తోపాటు అతడితో సన్నిహితంగా ఉన్న 9 మంది ప్లేయర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. దీంతో చివరి రెండు టీ20ల్లో యంగ్ ప్లేయర్లతో ఆడిన టీమిండియా పరాభవం మూటగట్టుకుంది. కీలకమైన మూడో మ్యాచ్‌లోనూ ఓడిన భారత్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.
కొలంబోలో శుక్రవారం నిర్వహించిన కరోనా టెస్టులో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటికే కరోనా సోకిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన తొమ్మిది మందిలో చాహల్, గౌతమ్ కూడా ఉన్నారని తెలిసింది. లంక టూర్ ముగిసినా ఐసోలేషన్‌లో ఉన్న చాహల్, గౌతమ్, కృనాల్ ఇప్పట్లో భారత్‌కు తిరిగిరారు. కొన్ని రోజులు అక్కడే ఉన్నాక రిటర్న్ బ్యాక్ అవుతారని తెలిసింది. శ్రీలంకలో హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం.. కరోనా సోకిన వారు తప్పకుండా 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి.