చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గందరగోళం నెలకొంది. 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా గవర్నర్ తిరస్కరించారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రావాలని సూచించారు గవర్నర్. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది.
ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ జోహో సహ వ్యవస్థాపకుడు, తమిళవాసి శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్నీ సీట్లు రాకపోవడంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అది అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని.. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అస్థిర ప్రభుత్వం రాష్ట్రానికి మంచిది కాదని.. తన రాష్ట్రం స్థిరమైన ప్రభుత్వానికి అర్హమైనదని పేర్కొన్నారు.
ఈసారి ఓట్లకు నోట్లు పంచకుండా కఠినంగా ఎన్నికలు నిర్వహించాలని.. అప్పుడు ప్రజలు ఎవరికీ పట్టం కడతారో తేలిపోతుందన్నారు. ఈసారి విజయ్ భారీ మెజార్టీతో గెలుస్తారని అంచనా వేశారు. విజయ్ను అడ్డుకోవాలంటే డీఎంకే, అన్నాడీఎంకే కలిసి పోరాడాలని సూచించారు. ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేకపోయినా బీజేపీ ఒంటరిగా పోరాడాలని.. తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభమని అన్నారు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు నిర్వహించి.. అధికారం ఎవరికీ ఇవ్వాలో ప్రజలనే నిర్ణయించనివ్వండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
