అమెరికాలో జింకలకు జాంబీ రోగం..నవంబర్ లో మొదటి కేసు

అమెరికాలో జింకలకు జాంబీ రోగం..నవంబర్ లో మొదటి కేసు
  • నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. నవంబర్​లోనే మొదటి కేసు
  • ఇప్పటికే వ్యాధి కారణంగా వందలాది జింకలు మృతి
  • మనుషులకూ సోకే ప్రమాదముందని ఆందోళన

‘జాంబీ డీర్ డిసీజ్’.. అమెరికాలో ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న జబ్బు.  జింకల్లో వేగంగా వ్యాపిస్తున్న ఈ డిసీజ్.. మనుషులకూ సోకే ప్రమాదం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక నాడీ సంబంధిత వ్యాధి.  నాడీ వ్యవస్థను దెబ్బతీసి మరణానికి కారణం అవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వ్యాధితో ఇప్పటికే వందలాది జింకలు మృతి చెందాయి.

కెనడా: అమెరికాలో ‘జాంబీ డీర్ డిసీజ్’ వేగంగా వ్యాపిస్తున్నదని కెనడాలోని సైంటిస్టులు ప్రకటించారు. ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది నాడీ సంబంధిత అంటు వ్యాధి అని వెల్లడించారు. ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి.. మనుషులకూ సోకే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దీర్ఘ కాలిక వ్యాధి అయిన ‘జాంబీ డీర్ డిసీజ్’.. నాడీ వ్యవస్థను దెబ్బతీసి జీవి మరణానికి కారణం అవుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన కొన్ని రోజుల్లోనే ప్రతి జంతువు చనిపోతున్నదని చెప్పారు. ముఖ్యంగా జింకల్లో ఈ డిసీజ్ వేగంగా వ్యాపిస్తుండటంతో వాటి జనాభా తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు కెనడియన్ ప్రావిన్స్ ఆఫ్ కొలంబియా స్పెషల్ స్ట్రాటజీని రిలీజ్ చేసింది. జనవరి నెలాఖరులో రెండు కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు వాటి సంఖ్య వేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. దీనిబారిన పడి వందలాది జింకలు చనిపోయాయని అన్నారు.

వింతగా ప్రవర్తిస్తున్న జింకలు

వన్యప్రాణులకు వ్యాపిస్తున్న ‘క్రానిక్ వేస్టింగ్ డిసీజ్’నే.. ‘జాంబీ డీర్ డిసీజ్’ అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింకలు, దుప్పుల్లో వేగంగా వ్యాపిస్తున్నది. దీని బారిన పడిన జంతువుల్లో ముందుగా ప్రోటీన్ వ్యవస్థ దెబ్బతింటుంది. తర్వాత నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మెల్లిగా మెదడులోని ఆర్గాన్స్, టిష్యూస్ దెబ్బతింటాయి. దీంతో జంతువులు వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా జంతువులు నీరసం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్​ఫెక్షన్​కు గురై చివరికి చనిపోతాయి. కెనడాలోని సస్కట్చేవాన్, అల్బెర్టా, క్యూబెక్​లోని జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు మానిటోబాలోని అడవి జింకలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. తొలుత అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్​లోని జింకల్లో నవంబర్‌లో ఈ వ్యాధిని గుర్తించారు. 

భవిష్యత్తులో మనుషులకే సోకే ప్రమాదం

జంతువుల నుంచి మనుషులకు ‘జాంబీ డీర్ డిసీజ్’ వ్యాపిస్తుందనడానికి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీలేదని కెనడా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కానీ.. యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన వెటర్నరీ స్కూల్ అధికారి మాత్రం దీన్ని ఖండించారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని గత పరిశోధనలతో స్పష్టమైందన్నారు.