సింగర్ జుబిన్ గార్గ్ను చంపేశారు: అసెంబ్లీలో సీఎం సంచలన ప్రకటన

సింగర్ జుబిన్ గార్గ్ను చంపేశారు: అసెంబ్లీలో సీఎం సంచలన ప్రకటన

సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై వివాదం కొనసాగుతూనే ఉంది. సింగపూర్ లో సెప్టెంబర్ 19న మృతి చెందిన జుబిన్ గార్గ్ స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ జుబిన్ మృతి పట్ల పలు అనుమానాలు మొదలయ్యాయి. సింగర్ మృతి సాధారణ మరణం కాదని ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసిన అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. మంగళవారం (నవంబర్ 25) అస్సాం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.

సింగర్ జుబిన్ గార్గ్ ను చంపేశారని ప్రకటించారు అస్సాం సీఎం. పక్కా ప్లాన్ తోనే జుబిన్ ను హత్య చేశారని అసెంబ్లీలో ప్రకటించారు. నిందితుల్లో ఒకరు హత్య చేయగా నలుగురు సహకరించారని అన్నారు. ఈ మిస్టరీకి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా జుబిన్ ది సాధారణ మరణం కాదని.. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.  జుబిన్ గార్గ్ మృతిపై ఏకసభ్య కమిషన్ కొనసాగుతుందని అన్నారు. వాంగ్మూలాల నమోదుకు కమిషన్ గడువు పొడిగించినట్లు తెలిపారు. డిసెంబర్ 12 వరకు దర్యాప్తు పొడిగించినట్లు తెలిపారు. 

ఈ కేసులో సీఐడీ ఆధ్యర్యంలో ఉన్న సిట్.. ఏడు మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 252 మంది నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు తెలిపారు. కేసుకు లింకు ఉన్న 29 వస్తువులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సిట్ సేకరించిన వివరాలు తెలిశాక.. ఈ హత్య వెనుక ఉన్న కుట్ర కోణం చూసి ప్రజలు షాక్ కు గురవుతారని చెప్పారు.

అస్సాంకు చెందిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ 2025, సెప్టెంబర్ 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించిన  విషయం తెలిసిందే. జుబీన్ సముద్రంలో పడిన వెంటనే, సింగపూర్ పోలీసులు అతన్ని రక్షించి CPR చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. అయితే, జుబిన్ మరణంపై పలు అనుమానాలు రేకెత్తడంతో అస్సాం ప్రభుత్వ విచారణకు ఆదేశించింది.

 జుబిన్ గార్గ్ డెత్ కేసు విచారణను సిట్‎కు అప్పగించింది. గార్గ్ మరణంపై విచారణ చేపట్టిన సిట్ పలువురు అనుమానితులను విచారించి ఏడుగురిని అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఓ వైపు కేసు విచారణ జరుగుతుండగానే.. జుబిన్ గార్గ్ హత్యకు గురయ్యాడని సీఎం హిమంత వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.