
- .కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ సెక్రటరీ రజత్ మిశ్రాను కోరిన ఎంపీ వంశీకృష్ణ
- ఆర్ఎఫ్సీలో సమస్యలు లేకుండా చూడాలని విజ్ఞప్తి
- సకాలంలో రాష్ట్రానికి ఎరువులు అందకపోవడంపై అసంతృప్తి
- మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని వినతి
- ఈ సీజన్‌లో 2.7 లక్షల టన్నుల ఎరువులు ఇస్తామని సెక్రటరీ హామీ
న్యూఢిల్లీ, వెలుగు: ఎరువుల కొరతతో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దని, సమస్య పరిష్కారం కోసం ఎంతవరకైనా పోరాడుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైతు బాగు కోసం– ప్రతి బస్తా ఎరువు కోసం మా పోరాటం’ అంటూ నినదించారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనా ల శాఖ కార్యదర్శి రజత్ మిశ్రాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎరువుల ఉత్పత్తిలో రామ గుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ (ఆర్ఎఫ్సీ)లో సమస్యలను సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. అనుకున్న ఉత్పత్తి స్థాయికి కంపెనీ చేరుకోలేకపోవడం కారణంగా తెలంగాణకు సరైన ఎరువుల కేటాయింపు జరగడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని రజత్‌ను కోరారు.
లోటును పూర్తిగా భర్తీ చేస్తామన్నారు..
రాష్ట్రానికి ఎరువుల సరఫరాపై సెక్రటరీ రజత్ మిశ్రా సానుకూలంగా స్పందించారని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. గత వ్యవసాయ సీజన్‌లో జరిగిన లోటును ఈ సీజన్‌లో పూర్తిగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మొత్తం 2.7 లక్షల టన్నుల ఎరువులు ఈ సీజన్‌లో తెలంగాణ రైతులకు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్‌ను ఎంపీ వంశీకృష్ణ ఇటీవల సందర్శించారు. ఎరువుల ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.