- రాహుల్, రేవంత్ రెడ్డి మహిళా ద్రోహులు
- బిల్లును అడ్డుకొని సంబురాలా: కిషన్ రెడ్డి
- తులం బంగారం, స్కూటీ ఏమయ్యాయి?: బండి సంజయ్
- విభజన రాజకీయాలకు కాంగ్రెస్ ప్రోత్సాహం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్‌లో మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మహిళా ద్రోహుల ని ఫైర్అయ్యారు. కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి మహి ళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ‘మహిళా ఆగ్రహ యాత్ర’ నిర్వహించారు. దోమల్‌గూడ ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడు తూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ మహిళలకు ద్రోహం చేస్తూనే ఉందన్నారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం ప్రధాని మోదీ ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును తెస్తే, దాన్ని అడ్డుకుని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ రోజును దేశ చరిత్రలో మహిళలకు జరిగిన అవమానకరమైన చీకటి రోజుగా పరిగణించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఒవైసీలకు మహిళా లోకం రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
మహిళా ద్రోహి రేవంత్ రెడ్డి: బండి సంజయ్
మహిళలకు ఇచ్చిన హామీలు నెలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీలను అమలు చేయకుం డా మోసం చేసిన రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహి ళా ద్రోహి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమ ర్శించారు. సోనియా, ఇందిర వంటి వారసత్వ నేతలు ఉంటే చాలని, సామాన్య మహిళలు చట్టసభలకు రాకూడదన్నదే కాంగ్రెస్ కుట్ర అని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ రెడ్డిని గద్దె దించాలని, ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను మహిళలు నిలదీయాలని కోరారు.
కౌరవ సభను తలపిస్తున్న కాంగ్రెస్: రాంచందర్ రావు
పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ద్రౌపదీ వస్త్రహరణం వేళ కౌరవులు నవ్వినట్లుగా ఉందని, కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులేనని విమర్శించారు. రాహుల్, రేవంత్ రెడ్డి దేశంలో విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
2029 నాటికి రిజర్వేషన్లు పక్కా: కె లక్ష్మణ్
డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, సీట్ల సంఖ్యను పెంచి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా మోదీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. దీనివల్ల తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని వివరించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా పెద్దపీట పడుతుందని వివరించారు.
సామాన్య మహిళలు రావద్దని కుట్ర: డీకే అరుణ, ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమ వారసులు తప్ప సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రాకూడ దన్నదే కాంగ్రెస్, ఇండియా కూటమి కుట్ర చేసిందని అన్నారు. మోదీ హై తో ముమ్కిన్ హై అని, మహిళా శక్తిని అడ్డుకోవాలని చూసే వారిని ప్రజలు పాతాళంలోకి తొక్కడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మహిళా నేతలు శిల్పారెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

