పిల్లల్ని వదిలేయండి.. కావాలంటే నన్ను చంపండి

పిల్లల్ని వదిలేయండి.. కావాలంటే నన్ను చంపండి
  • మయన్మార్ లో పోలీసుల ఎదుట మోకరిల్లిన క్రైస్తవ సన్యాసిని
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

యాంగన్(మయన్మార్): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికార పగ్గాలు చేపట్టిన జుంటా (ఆర్మీ)కు వ్యతిరేకంగా మయన్మార్ లో ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలంటూ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, రబ్బర్ బులెట్లతోపాటు నిజమైన బుల్లెట్లను కూడా ప్రయోగిస్తున్నాయి. మంగళవారం కచిన్ స్టేట్ క్యాపిటల్ మిట్కినాలో ఆందోళనకారులను వెంబడించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. గుంపును చెదరగొట్టి ఫైరింగ్కు రెడీ అయ్యారు. ఇంతలో 45 ఏండ్ల ఓ క్రైస్తవ సన్యాసి(నన్) సిస్టర్ ఆన్ రోస్ తవాంగ్ పోలీసులకు ఎదురెళ్లింది. వాళ్లను వదిలేయాలని మోకాళ్లపై నిలబడి వేడుకుంది. 'పిల్లల్ని వదిలేయండి.. వాళ్లకు బదులుగా నన్ను చంపండి' అంటూ కోరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.  పోలీసులకు ఎదురెళ్లిన సిస్టర్ ఆన్ రోస్ ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఆందోళనకారులను పోలీసులు తరుముతున్నారు. దీంతో నాకు బాధ కలిగింది. పిల్లలను టార్చర్ చేయకండి, వాళ్లను కాల్చకండని వేడుకున్నా. వాళ్లకు బదులుగా నన్ను షూట్ చేయాలని అడిగా'అని ఆన్ రోస్ అన్నారు.  తాను వేడుకుంటున్నా.. పోలీసులు ఫైరింగ్ జరిపారని వాపోయారు. పోలీసులు చుట్టు ముట్టడంతో  ఆన్ రోస్ను కాపాడుకునేందుకు లోకల్ బిషప్, సిస్టర్లు ముందుకొచ్చారు. 'మా సిస్టర్ను కాపాడుకునేందుకు మేము అక్కడికి వెళ్లాం. ఆమె తన లైఫ్ను రిస్క్ లో పెట్టింది' అని సిస్టర్ మేరీ జాన్ పాల్ చెప్పారు.