జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ కుటుంబానికి తోటి ఎస్‌ఐలు భారీ విరాళం అందజేశారు. దేశిని చంద్రశేఖర్ 2014 బ్యాచ్‌కి చెందిన ఎస్‌ఐ. ఆయన భార్య మార్చిలో కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఐదు రోజులకు చంద్రశేఖర్ కూడా ఉరేసుకున్నాడు.
దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చంద్రశేఖర్ బ్యాచ్‌కు చెందిన పలువురు ఎస్‌ఐలు సుమారు రూ.25లక్షలు కలెక్ట్ చేసి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదివారం కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, దానివల్ల కుటుంబంతో పాటు పిల్లలు అనాథలు మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

