రైతుల ఖాతాల్లో 4,520 కోట్లు జమ..ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వడ్లు కొన్నం: సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 

రైతుల ఖాతాల్లో 4,520 కోట్లు జమ..ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వడ్లు కొన్నం: సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగిలో ఇప్పటి వరకు 30లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్టు సివిల్​ సప్లయ్స్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు రూ.4,520 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. రైతులు పెద్ద ఎత్తున సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ఇప్పటివరకు 9 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం, 21 లక్షల  టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం కొనుగోళ్లు గణనీయంగా  కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు  నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెంటర్లలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగా 18.6 కోట్ల గన్నీ బ్యాగులు, తగినన్ని తార్పాలిన్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వేగంగా తరలించేందుకు దాదాపు 11,500 లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. లోడింగ్, అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ప్రత్యేక అధికారులను నియమించినట్టు పేర్కొన్నారు.

హమాలీల కొరత నివారణతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూసీ గోదాముల వద్ద హమాలీ చార్జీలను క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.17కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ సీజన్​(2025=-26)కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ) రాష్ట్రానికి 10 లక్షల  టన్నుల బాయిల్డ్​ రైస్​ కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు. అన్నిశాఖల సమన్వయం, రోజువారీ పర్యవేక్షణతో ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు