- 1,390 కోట్ల వడ్డీ చెల్లించాం: సీతక్క
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారమే మీ పని
- మహిళలను బద్నాం చేయొద్దని కేటీఆర్కు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో మహిళ సంఘాలకు రూ.57,937 వేల కోట్ల రుణాలు ఇచ్చామని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వడ్డీ రూపంలోనే రూ.1,390 కోట్లు చెల్లించామన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో అర్థం కావట్లేదని అనగా.. మంత్రి సీతక్క జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. 2023 డిసెంబర్ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు మహిళ సంఘాలకు ఇచ్చిన లోన్లు, వడ్డీలను మంత్రి వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని మంత్రి మండిపడ్డారు. సత్యదూరాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. “గత పదేళ్లుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. బీఆర్ఎస్ హాయంలో రూ.4,051 కోట్ల వడ్డీలను చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు. రూ. 1,121 కోట్లు మహిళ సంఘాలకు వడ్డీ రూపంలో చెల్లించాం. శిల్పారామంలో 106 షాపులను మహిళ సంఘాలకు కేటాయించాం. ఫ్రీ బస్సుతో పాటు ఏ స్కీం తీసుకొచ్చినా తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలతో సోషల్ మీడియాలో బాద్నాం చేస్తున్నారు.
మేడారం జాతరలో మహిళ సంఘాలకు షాపులు కేటాయించి రూ.6 కోట్లతో బిజినెస్ చేస్తే రూ. 9.33 కోట్లు వ్యాపారం జరిగింది. మహిళల గురించి ఎగతాళిగా మాట్లాడొద్దు. దయచేసి మహిళలను బద్నాం చేయకండి” అని సీతక్క అన్నారు. మా ప్రభుత్వంపై మాట్లాడే ముందు మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు దానికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఐదు లక్షల రుణాల వరకు వడ్డీలను లిమిట్ చేస్తూ హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు ఐదు లక్షలకు మించిన రుణాలకు కూడా వడ్డీలు చెల్లించాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు.
