- దక్షిణాదిలోని 20 యూనివర్సిటీల యువ పరిశోధకుల కలయిక
ఓయూ, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయం యువ ఆవిష్కరణలు, శాస్త్రీయ పరిశోధనలకు వేదికగా నిలిచింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో శుక్రవారం ‘అన్వేషణ్-2026’ సౌత్ జోన్ స్టూడెంట్ రీసెర్చ్ కన్వెన్షన్ ఘనంగా ప్రారంభమైంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కన్వెన్షన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 20 విశ్వవిద్యాలయాల నుంచి 788 మంది యువ పరిశోధకులు పాల్గొన్నారు.
మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వి.వి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, సివెంటికెమ్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో డాక్టర్ భాస్కర్ రావు వెనెపల్లి, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రాలుగా మారాలని సూచించారు. వి.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువ పరిశోధకులు శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పట్టుదలతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ భాస్కర్ రావు వెనెపల్లి పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల పరిశోధనలకు మధ్య అనుసంధానం పెరగాలని సూచించారు.
