- కేటీఆర్ 'యువ సమరభేరీ' అట్టర్ ఫ్లాప్
- పొర్లుదండాల సభ పెట్టినా యువత క్షమించదని ఫైర్
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని, ఆ రెండు పార్టీల పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, దొంగ హామీలు, మొసలి కన్నీళ్లతో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
'డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా టీచర్లను వేధిస్తోంది.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక ఉన్నత చదువులు ఆపేస్తున్న విద్యార్థుల కన్నీళ్లకు మీరు బాధ్యులు కాదా?' అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే భారీగా అప్పులు చేసిందని ఆరోపించారు. పాఠశాలలను మూసివేస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదేనని ఆరోపించారు.
కరీంనగర్లో కేటీఆర్ నిర్వహించిన 'యువ సమరభేరీ' అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. 'సమరభేరీలో కేటీఆర్ ఇచ్చిన సందేశమేంటి? నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు.. మీరు కూడా తీసుకోకండి’ అని జెన్-జీ యువతకు చెప్పే దమ్ము కేటీఆర్‌కు ఉందా?' అని సవాల్ విసిరారు. 'ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నేనే కారణమని అంబేద్కర్ గ్రౌండ్స్‌లో కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, పథకాలు ఎత్తివేసిన పాపానికి వేదికపై చెంపలేసుకోవాల్సింది.
పేపర్ లీకేజీల పాపం నాదేనని చేసిన తప్పుకు సమరభేరీలో తలవంచాల్సింది. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు గుంజీలు తీయాల్సింది' అని సంజయ్ మండిపడ్డారు. అది యువ సమరభేరీ కాదు కదా.. పొర్లుదండాల సభ పెట్టినా బీఆర్ఎస్ను యువత క్షమించబోదని హెచ్చరించారు.
