- భీంరెడ్డి ప్రధాన బినామీగా మాజీ హోంగార్డ్ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: సస్పెన్షన్‌కు గురైన డీఎస్పీ భీంరెడ్డికి సంబంధించిన భారీ అక్రమాస్తుల కేసులో ఐటీ శాఖ దూకుడు పెంచింది. భీంరెడ్డి సహా మరో 8 మందిపై 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్' కింద కేసులు నమోదు చేశారు. జులై 6న ఏసీబీ జరిపిన సోదాల్లో రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు వెలుగుచూసింది. ఆ వివరాల ఆధారంగా ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తులో భీంరెడ్డి వద్ద పనిచేసిన మాజీ హోంగార్డు లక్ష్మణ్‌ను ప్రధాన బినామీగా, నరేందర్ రెడ్డి, వెంకటేశ్ తదితరులను కూడా బినామీలుగా నిర్ధారించారు.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, జహీరాబాద్, కర్నాటకలోని దేవనపల్లి తదితర ప్రాంతాల్లో లక్ష్మణ్ పేరు మీద ఏకంగా 46 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్చెరు, నాగోలు, బెంగళూరు వంటి పలు కీలక ప్రాంతాల్లో సుమారు 20కి పైగా ఆస్తుల డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ బినామీ ఆస్తుల కొనుగోళ్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు యజమాని ఎవరనే కోణంలో అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు. బినామీ చట్టం కింద నేరం రుజువయితే ఈ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
