- నీటి నష్టాలు తగ్గిస్తూ కాల్వ గట్లను పటిష్టం చెయ్యాలి
- రైతుల ఆందోళన, లీగల్, విధానపర కార్యాచరణపై సీఎంకు రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆర్డీఎస్ బలోపేతం, తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా పూర్తి చెయ్యడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్‌లో అధికారులతో రివ్యూ చేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, జలవనరుల నిపుణులు, ఉన్నతాధికారులు, ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను రైతు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎమర్జెన్సీగా పునరుద్ధరించాల్సిన అవసరముందని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని, కాల్వ గట్లను పటిష్టం చేయాలని, నీటి నష్టాలను తగ్గిస్తూ కాల్వల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలన్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో వేగం పెంచాలన్నారు. వీటి ద్వారా 2.12 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన, తగిన పరిహారం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మల్లమ్మకుంట జలాశయం వల్ల 567 ఎకరాలు, జూలకల్ వల్ల 382 ఎకరాలు, వల్లూరు జలాశయం వల్ల 2,216 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హామీ మేరకు నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తుంగభద్ర హక్కులు వదులుకోవద్దు
తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులపై రాజీపడబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయ, పరిపాలనా చర్యలన్నింటినీ చేపడ్తామన్నారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు యాక్టివ్‌గా వ్యవహరించాలని సూచించారు. జలాశయ నిర్వహణ, కాల్వల ఆపరేషన్లు, మౌలిక వసతుల సంరక్షణ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. ఆర్డీఎస్ నిర్వహణ, కేసీ కెనాల్ నీటి విడుదల, అంతర్రాష్ట్ర సమన్వయం, ట్రిబ్యునల్ తీర్పుల అమలు వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. టెక్నికల్ అంశాలు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన అంశాలు, విధానపరమైన ప్రత్యామ్నాయాలపై నివేదిక సిద్ధం చేసి సీఎంకు సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, తుంగభద్ర డ్యామ్ భద్రత, తుంగభద్ర బోర్డు పాత్ర వంటి అంశాలపై త్వరలోనే సీఎంతో ప్రత్యేకంగాచర్చిస్తామని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కర్నాటక, ఏపీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే తెలంగాణ నీటి హక్కులను కాపాడుతామని పేర్కొన్నారు.
