కేబీఆర్ పార్కు చుట్టూ పట్టాలెక్కిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టు.. పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు

కేబీఆర్ పార్కు చుట్టూ పట్టాలెక్కిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టు.. పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రూ. 1,090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శుక్రవారం ముగ్దా జంక్షన్ వద్ద భూమి పూజ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్ ఆధ్వర్యంలో అధికారులు ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు.

మొత్తం ఆరు ప్రధాన రద్దీ జంక్షన్ల మీదుగా సాగే ఈ ప్రాజెక్టును రెండు విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు శనివారం నుంచి మరింత ముమ్మరం కానుండటంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని అధికారులు సూచించారు. 

రెండు దశల్లో పనులు ఇలా..

మొదటి దశలో రూ. 580 కోట్ల వ్యయంతో జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ వద్ద ‘వై’ ఆకృతిలో రోడ్ నం. 45 నుంచి యూసఫ్​గూడ వరకు గ్రేడ్ సెపరేటర్, కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి రోడ్ నెం. 36 వైపు నాలుగు వరుసల స్టీల్ ఫ్లైఓవర్, యూసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ నుంచి రోడ్ నెం. 45 వైపు రెండు వరుసల ఫ్లైఓవర్​తో పాటు పంజాగుట్ట, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వైపు వెళ్లేందుకు పలు అండర్ పాస్ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇక రెండో దశలో రూ. 510 కోట్ల వ్యయంతో ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ల కేంద్రంగా పనులు చేపట్టనున్నారు. ఈ రెండు దశల నిర్మాణాలు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్ చుట్టూ ఉన్న ఆరు ప్రధాన జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి వచ్చి, నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ట్రాఫిక్ రహితంగా మారనుంది.