బెంగళూరు నగరంలోని ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ లో విషాదం చోటుచేసుకుంది. కంపెనీ భవనం ఐదో అంతస్తు నుంచి పడి 26 ఏళ్ల ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతుడిని బనశంకరి ప్రాంతానికి చెందిన ఎస్. అనంత కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అనంత కుమార్ గత ఆరు నెలలుగా బయోకాన్ ఫైనాన్స్ డివిజన్లో పనిచేస్తున్నారు. అతని తండ్రి శ్రీనాథ్ ఒక ఆలయ పూజారి.
పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కుమార్ ఆఫీసులోని కేఫ్టీరియా టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన కుమార్‌ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీ చేయగా ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అయితే అనంత కుమార్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అని అగ్రహార పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, చివరిగా ఎవరితో ఫోన్ మాట్లాడాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ఫోన్ కాల్ డేటా సేకరిస్తున్నారు.
ఈ ఘటనపై బయోకాన్ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మా ఉద్యోగి మరణం తీవ్రంగా కలచివేసింది. ఈ సమయంలో బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
