
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎంపిక చేసిన 295 అంగన్వాడీ కేంద్రాలకు విత్తనాల కిట్లు
- నిర్వహణకు ఒక్కో కేంద్రానికి రూ.10వేలు
భద్రాచలం, వెలుగు : అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు ఇకపై మరింత బలవర్ధకమైన ఆహారం అందనుంది. కేంద్ర ప్రభుత్వం పోషణ్ వాటిక అనే పథకం ద్వారా ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలకు రూ.10వేల చొప్పున నిధులు కేటాయిస్తోంది. ఈ మేరకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కూరగాయలు, ఆకు కూరలు పండించేందుకు వీలున్న 295 కేంద్రాలను ఇటీవల ఎంపిక చేశారు. 2023లో ఇప్పటికే 55 కేంద్రాలకు ఈ పథకం కోసం ఎంపిక చేసి నిధులిచ్చారు.
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6,742 మంది గర్భిణులు, 5,540 మంది బాలింతలు, 56,945 మంది చిన్నారులు ఈ కేంద్రాల ద్వారా పోషకాహారం పొందుతున్నారు. వీరికి గుడ్లు, పాలు, కుర్కురే లాంటి వాటితో పాటు కూరగాయలతో పౌష్టికాహారం వండిపెడుతున్నారు.
తాజా కూరలతో..
గతంలో ఆకుకూరలు, కూరగాయలు టెండర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేవారు. టెండర్ల ద్వారా హక్కులు పొందిన కాంట్రాక్టర్లు పాడైపోయిన ఆకుకూరలు, కుళ్లిన కూరగాయలను కేంద్రాలకు అంటగట్టేవారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల ప్రాంగణంలోనే ఖాళీ ప్రదేశాల్లో స్వయంగా కూరగాయలు, ఆకు కూరలు సేంద్రీయ ఎరువులతో పండించాలని నిర్ణయించారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తన ప్యాకెట్లు అందించనున్నారు.
ఈ విత్తన కిట్లలో పాలకూర, మెంతి, ఉసిరి, వంకాయ, టమాట, బెండ, పొట్ల గింజలు ఉంటాయి. ఈ కిట్ల రవాణాతో పాటు, వీటిని సాగు చేయడానికి, నీటి ఖర్చుల కోసం రూ.10వేలను కేంద్రం ఖర్చు పెట్టనుంది. ఉసిరి, కలబంద, మునగ వంటి మొక్కలను కూడా అంగన్వాడీ కేంద్రాల ప్రాంగణాల్లో పెంచనున్నారు. బలవర్ధకమైన ఆహారం చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించడమే లక్ష్యంగా ఈ పథకం రూపకల్పన చేశారు.
రక్షణ తలకు మించిన భారం
అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు, ఆకు కూరల, ఇతర మొక్కల సాగు విషయంలో రక్షణ తలకు మించిన భారంగా మారింది. ప్రహరీలు ఉన్నా కోతుల బెడద జిల్లాలోని కేంద్రాలకు శాపంగా తయారైంది. వివిధ పట్టణాల నుంచి కోతులను తీసుకొచ్చి ఏజెన్సీలో వదిలిపెడుతున్నారు. అడవుల్లో ఫలాలు దొరక్క అవి ఊళ్లపై పడుతున్నాయి. రైతుల పంటలతో పాటు ఇళ్లలోని మొక్కలను సైతం నాశనం చేస్తున్నాయి. పోషణ్వాటిక పథకంలో అంగన్వాడీ కేంద్రాల్లో నాటే మొక్కల సంరక్షణ కూడా జఠిలమవుతుందని టీచర్లు వాపోతున్నారు.