
స్వీట్ పొటాటో ( మొరంగడ్డ లేదా చిలగడ దుంప)తో ఎప్పుడైనా స్వీట్ ట్రై చేశారా? పోనీ వాటితో చేసిన శ్నాక్స్ టేస్ట్ చేశారా? ఇప్పటివరకు చేయకపోతే మాత్రం సూపర్ ఫుడ్ మిస్ అయినట్లే. మీరు మిస్ అవ్వకూడదు అంటే.. వెంటనే ఇక్కడున్న త్రీ ఇంట్రెస్టింగ్ రెసీపీలను చదివేయండి. హెల్దీగా ఉండే ఈ ఐటెమ్స్‌ను టేస్టీగా చేసి పెట్టండి.
స్వీట్
కావాల్సినవి :
స్వీట్ పొటాటోలు – రెండు
పాలు – అర లీటర్
నెయ్యి – ఒక టీస్పూన్
చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – పావు టీస్పూన్
తయారీ :స్వీట్ పొటాటోలను తొక్క తీసి, నీళ్లలో వేసి కడగాలి. ఒక గిన్నెలో పాలు పోసి అవి సగం అయ్యేవరకు కాగబెట్టాలి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా కలపాలి. మూతపెట్టి మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. చివరిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచాలి. ఎంతో సింపుల్‌గా ఉండే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా.
రింగ్స్
కావాల్సినవి :
స్వీట్ పొటాటో – మూడు
నెయ్యి – రెండు టీ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు
చీజ్, నూనె, మైదా, కోడిగుడ్డు సొన,
బ్రెడ్ క్రంబ్స్ – సరిపడా
తయారీ :స్వీట్‌పొటాటోలను ఉడికించి, తొక్క తీసి మెదపాలి. ఒక గిన్నెలో మెదిపిన స్వీట్పొటాటోలు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత అందులోనే కార్న్ ఫ్లోర్ వేసి కలిపి ముద్ద చేయాలి. ఆ పిండి ముద్దను కొంచెం తీసుకుని పొడవుగా చేయాలి. దాని మధ్యలో చీజ్ స్లైస్‌లు పెట్టి మూసేయాలి. చివరిగా రింగ్లాగ చుట్టాలి. అలా తయారుచేసిన వాటికి మైదా పట్టించాలి. తర్వాత కోడిగుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ కంబ్స్లో దొర్లించాలి. చివరిగా వాటిని వేడి వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
చిప్స్
కావాల్సినవి :
స్వీట్ పొటాటోలు – రెండు
వెన్న, బియ్యప్పిండి – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
బెల్లం, ఉప్పు – సరిపడా
నువ్వులు – రెండు టీస్పూన్లు
తయారీ :స్వీట్ పొటాటోలను తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసి, ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి మెదపాలి. అందులో బెల్లం, వెన్న, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, నువ్వులు వేసి మరోసారి బాగా కలిపి ముద్దలా చేయాలి. ఆ తర్వాత ఆ పిండితో చిన్న ఉండలు చేయాలి. వాటిని సమానంగా చిన్న అప్పడంలా వత్తాలి. ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి దానిపై ఈ చిప్స్ పెట్టి ఒవెన్‌లో బేక్ చేయాలి. లేదా నూనె వేడి చేసి వేగించుకోవచ్చు.