
- అమృత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 40 స్టేషన్లను ఆధునీకరిస్తున్నం: కిషన్ రెడ్డి
- బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవానికి హాజరు
- వర్చువల్‌గా ఓపెన్ చేసిన ప్రధాని మోదీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రాష్ట్రంలో రూ.5,337 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దామన్నారు. స్టేషన్ నిర్వహణ పూర్తిగా మహిళా సిబ్బందే చూసుకుంటారని వివరించారు. రాజమాత అహల్యబాయి 300వ జయంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్‌ను మళ్లీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమృత్ స్టేషన్ల నిర్మాణాల్లో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను వర్చువల్‌గా పున:ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ బేగంపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాతూ.. ‘‘తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగంగా జరుగుతున్నది. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. తెలంగాణలో 40 స్టేషన్లు ఎంపికయ్యాయి.
ఇందులో 3 స్టేషన్లను ప్రారంభించుకున్నాం. సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.720 కోట్లు, నాంపల్లి స్టేషన్‌కు రూ.350 కోట్లు కేటాయించాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.5,337 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రూ.42,219 కోట్లు కేటాయించారు. వచ్చే దసరా నాటికి కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ సిటీ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభిస్తాం’’అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉన్న ఇండియన్ రైల్వే.. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తుంటారని తెలిపారు. వారి కోసం సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమన్నారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.