రోజు 7 వేల అడుగులు వేయండి.. వందేళ్లు ఆరోగ్యంగా బతకండి..

 రోజు 7 వేల అడుగులు వేయండి.. వందేళ్లు ఆరోగ్యంగా బతకండి..

ఒక ఆరోగ్యమైన వ్యక్తి రోజుకు ఎంత దూరం నడవాలి ? దీనికి సమాధానం ఇదిగో.. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో నడక అధ్యయనం 7వేల అడుగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఎక్కువకాలం పాటు అనారోగ్యానికి గురికాకుండా,  అధిక సామర్థ్యాన్ని ఇస్తుందని తెలిపింది. 

ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో వచ్చిన పరిశోధన ఫలితాలు 1లక్ష60వేల కంటే ఎక్కువ మందిపై నిర్వహించిన 57 అధ్యయనాల నుండి వచ్చింది. ఇందులో రోజుకు కేవలం 7వేల అడుగులు నడిచిన ఊహించని మరణాలు ఇంకా  తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు.

రోజుకు 7వేల అడుగులు నడవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయని  ఇంకా ఎన్నో రకాల జబ్బుల నుండి కాపాడుతుందని అధ్యయనం చెబుతోంది. అంతేకాదు రోజుకు 7వేల అడుగులు నడిచేవారిలో గుండె జబ్బులు లేదా ఇతర కారణాల వల్ల చనిపోయే ప్రమాదం 47% వరకు తగ్గుతుంది. మతిమరుపు (డిమెన్షియా) వచ్చే అవకాశం కూడా 38% తగ్గుతుంది. అలాగే షుగర్ (డయాబెటిస్) వచ్చే ప్రమాదం 14% వరకు తగ్గుతుంది. డిప్రెషన్ లక్షణాలు కూడా 22% తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.

 నడక ఎందుకు మంచిది:  నిపుణులు ప్రకారం 7వేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్య లాభాలు బాగా పెరుగుతాయి. సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మెలోడీ డింగ్ మాట్లాడుతూ 7వేల అడుగులు నడక చాలా మందికి చాల ఈజీ. దీని కోసం జిమ్ వెళ్లడం అవసరం లేదని అన్నారు. కనీసం రోజుకు 4వేల అడుగులు నడిచినా కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎక్కువ నడక సాధ్యం కానప్పుడు కనీసం 4వేల అడుగులు నడిచినా కూడా ఆరోగ్య మేలు ఉంటుంది. డాక్టర్ కన్వర్ కెల్లీ మాట్లాడుతూ చాలా ఎక్కువ అడుగులు వేయాలని పరుగెత్తడం కంటే సాధారణంగా నడవడం ముఖ్యమని, మీ జీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలని అలాగే మెట్లు ఎక్కడం, భోజనం తరువాత నడవడం లేదా చిన్న చిన్న పనులకు నడుచుకుంటూ వెళ్లడం వంటివి చేయొచ్చు అని చెప్పారు. 

7వేల అడుగులు నడిచే అలవాటు ఎలా చేసుకోవాలంటే 
*మూడుసార్లు 10 నిమిషాల చొప్పున నడిస్తే చాలు, 7వేల అడుగులకి చేరుకోవచ్చు.
*ఆఫీసుకు దూరంగా బైక్ పార్కింగ్ చేయడం లేదా బస్సు/మెట్రోకి ఒక స్టాప్ ముందే దిగి నడవడం లాంటివి చేయొచ్చు.
*పెడోమీటర్, స్మార్ట్‌వాచ్ లేదా ఫోన్ యాప్‌ని వాడి ఎన్ని అడుగులు వేస్తున్నారో చెక్ చేసుకోవచ్చు. 
* ప్రతిరోజూ ఒకే ప్రదేశంలో నడక బోర్ కొట్టకుండా ఉండాలంటే కొత్త ప్రదేశాలలో, దారుల్లో నడవడానికి ట్రై చేయండి.