- నిర్మల్ జిల్లాలో 844 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
- 12 చెక్ పోస్టులు ఏర్పాటు
- ఈ నెలాఖరు వరకు అమలులో 30 పోలీస్ యాక్ట్
నిర్మల్, వెలుగు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో తనిఖీలు, బందోబస్తుపై ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి డబ్బు, మద్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా చూసేందుకు 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
వీటిలో 8 ఇంటర్ స్టేట్, 4 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు. అలాగే జిల్లాలోని మొత్తం 400 గ్రామ పంచాయతీల్లో 844 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిపై నిఘా ఉంచి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. రాత్రి గస్తీని ముమ్మరం చేయనున్నారు.
24 గంటలపాటు వాహనాల తనిఖీ
పోలీసులు చెక్ పోస్టుల వద్ద 24 గంటలపాటు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. సారంగాపూర్ మండలంలోని రామ్ సింగ్ తండా, కుభీర్ మండలంలోని సిరిపెల్లి, సేవాలాల్ తండా, డోడర్న తండా, కుంటాల మండలంలోని దౌనెల్లి తండా, తానూరు మండలంలోని బెల్తా రోడా, జవ్లాబీ, బాసర, బిదిరెల్లి వద్ద ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బాసర గోదావరి బ్రిడ్జిపై, ఖానాపూర్ బాదనకుర్తి బ్రిడ్జిపై, కడెం మండలంలోని పాండవపూర్, సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అనుమతి లేకుండా మీటింగులు పెట్టొద్దు
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిర్మల్‌జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు చేపట్టొద్దని సూచించారు. కత్తులు, కర్రలు, , తుపాకులు, పేలుడు పదార్థాలు వంటివి వాడొద్దన్నారు. లౌడ్స్పీకర్లు, డీజేలు వినియోగించడం నిషేధమని తెలిపారు.
