
ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన మగ శిశువుని గోనె సంచిలో పెట్టి.. రోడ్డు పక్కన పడేశారు. ఊపిరాడకుండా ఉండేందుకు గోనె సంచికి ముడి వేశారు. అయితే.. ఆ శిశువు ప్రాణాలతో బతికి బయటపడింది.
గిద్దలూరు తహశీల్దారు కార్యాలయం సమీపంలో ఓ పసికందు( మగబిడ్డ)ను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో వదలి వెళ్లారు. అయితే ఆ సంచిని పందులు లాక్కెళ్తుండగా పసికందు ఏడుపు విని అక్కడున్న రెవిన్యూ సిబ్బంది పందులను తరిమి.. చిన్నారిని కాపాడారు. ఆ శిశువును గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెవిన్యూ సిబ్బంది అప్పమత్తంగా ఉండడంతో శిశువు క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నారిని ఇంత దారుణంగా వదిలేసిన తల్లిదండ్రులెవరోనని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టింది మగబిడ్డ అయినా ఎందుకు వదిలేసి ఉంటారని, ఇలాంటి ఘటనలు.. నిత్యకృత్యమవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరుతున్నారు.