ఈ సమ్మర్లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? కస్టమర్లకు షాకిస్తున్న కంపెనీలు..!

ఈ  సమ్మర్లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? కస్టమర్లకు షాకిస్తున్న కంపెనీలు..!

ఎండాకాలం వచ్చేసింది... ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతున్నాయి, గాలీ వేడెక్కుతుంది. దింతో రోజు ప్రయాణించే వారికీ సూర్యుడి ప్రతాపం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎండాకాలం అనగానే గుర్తొచ్చేది ACలు, కూలర్లు. ఈ సమ్మర్ సీజన్ ని ముందుగానే క్యాష్ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రెడీ అవుతున్నాయి.      

వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఎయిర్ కండిషనర్ల ధరలు పెరగబోతున్నాయి. మార్చిలో  ప్రముఖ ఏసీ బ్రాండ్లు ఇప్పటికే ఏసీల ధరలను 5-7 శాతం పెంచగా, ఇతర బ్రాండ్లు కూడా మరో వారం, పది రోజుల్లో ధరల పెంపు చేసే అవకాశం ఉంది. దీనికి కారణం తయారీ ఖర్చులు పెరగడం, రాబోయే రోజుల్లో ఏసీలకు మంచి  డిమాండ్ ఉంటుందని అంచనా వేయడమే. మార్చి నెలలోనే డీలర్లు భారీగా స్టాక్‌ స్టోర్ చేసుకున్నారు. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాలతో కూడా డిస్ట్రిబ్యూటర్లకి ఆశలు పెరిగాయి.  

ధరల పెంపుకు ముఖ్య కారణాలు:
ఏసీ తయారీ కంపెనీలు ధరలు పెంచడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఏసీలో కీలకమైన కంప్రెసర్లు, కాయిల్స్‌ తయారీకి రాగి   ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పెరగడంతో ఏసీల తయారీ ఖర్చు పెరిగింది. అలాగే  విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఏసీ విడిభాగాల ధరలు పెరిగాయి. దీనికితోడు రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు కూడా కాస్ట్లీ గా మారాయి.

ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో పెరుగుతున్న  ఉద్రిక్తత  వాతావరణం వల్ల సరుకు రవాణాకి ఆటంకం ఏర్పడింది. దీనివల్ల విడిభాగాల లభ్యత తగ్గి, రవాణా ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వం ఇంధన సామర్థ్యం  విషయంలో ఇప్పటికే  కఠినమైన నిబంధనలు తెచ్చింది. తక్కువ విద్యుత్ ఖర్చయ్యేలా ఏసీలను అప్‌గ్రేడ్ చేయడం వల్ల తయారీ ఖర్చు మరింత పెరిగింది.

ఎండలు & డిమాండ్:
భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం, ఈ ఏడాది మార్చి నుండి మే మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అంటే ఈ వేసవి ఇంతకుముందు లేనంత వేడిగా ఉండొచ్చు. ఎండలు పెరిగే కొద్దీ ఏసీలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దింతో ఏసీల ధరలు 10 శాతం నుండి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది చూస్తే ఏసీల  ధరలు కొంత తగ్గాయి. ముఖ్యంగా సెప్టెంబర్ లో ఎయిర్ కండిషనర్లపై ఉన్న GSTని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో కస్టమర్లకు కొంత రిలీఫ్ లభించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే  ఇప్పుడు ఎలాంటి రిలీఫ్ కనిపించేల లేదు. పెరుగుతున్న ఎండలు, ముడి పదార్థాల కొరత, అంతర్జాతీయ సమస్యల వల్ల ఈ వేసవిలో ఏసీ కొనడం కస్టమర్లకు   కాస్త అధిక ఖర్చు భారం పడొచ్చు.