
బషీర్ బాగ్, వెలుగు: గంజాయి కేసులో అరెస్టయిన ఓ నిందితుడు నాంపల్లి కోర్టులో హల్‌చల్ చేశాడు. ఈ నెల 25న తన పెళ్లి ఉందని, జైలుకు వెళ్లనని నానా హంగామా చేశాడు. ఆనంద్ అగర్వాల్ అనే వ్యక్తిని శాలిబండ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అయితే, తనకు పెళ్లి కుదిరిందని, ఈ నెల 25నే పెండ్లి ఉందని, జైలుకెళ్లనని నిందితుడు మొండికేశాడు.
అంతటితో ఆగకుండా కోర్టు లోపల ఉన్న డోర్ అద్దాలను పగులగొట్టడంతో అతని చేతికి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆనంద్‌ను అదుపు చేసి, చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆనంద్ అగర్వాల్ ఓ రౌడీ షీటర్ అని, అతనిపై18 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల క్రితమే మర్డర్ కేసులో జైలుకెళ్లి రిలీజయ్యాడని చెప్పారు.