
- రాష్ట్రవ్యాప్తంగా 100 ఇండ్లకు స్లాబ్ పూర్తి
- రేపటి నుంచి 2వ విడత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు
- రెండో విడతలో 2.05 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక
- ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసినవారి ఖాతాల్లో నిధులు జమ
- తొలిదశలో ఐదు వేల బేస్ మెంట్స్ కంప్లీట్, 20 వేల ఇండ్ల నిర్మాణం స్టార్ట్
హైదరాబాద్, వెలుగు:ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు శరవేగంగా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 వేల ఇండ్ల నిర్మాణం బేస్మెంట్ పనులు స్టార్ట్ కాగా.. ఇందులో 5 వేల మంది బేస్ మెంట్ నిర్మాణం పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందుకొని గోడలు కూడా నిర్మిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల బేస్ మెంట్ పూర్తి చేస్తున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం తొలి దశ సాయం అందచేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా గత కొద్దిరోజుల నుంచి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు తొలి దశ సాయాన్ని అధికారులు జమ చేస్తున్నారు.
రేపటి నుంచి రెండో విడత మంజూరు
రాష్ర్ట వ్యాప్తంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. నియోజకవర్గానికి 3500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా 33,500 ఇండ్లను సీఎం విచక్షణాధికారం కింద కేటాయించారు. ఇందులో 25 వేలు మూసీ నిర్వాసితులకు కేటాయించారు. తొలి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేయగా మిగిలిన కోటా ఇండ్లను రెండో దశలో అధికారులు ఎంపిక చేస్తున్నారు.
ప్రజా పాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వారిలో తొలి దశలో సొంత జాగా ఉన్న వారిని ఎంపిక చేయగా.. గ్రామ సభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వెల్లడించి తరువాత ఇందిరమ్మ కమిటీలకు అందచేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి పంపి తరువాత జిల్లా ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్న మంత్రి ఆమోదం తీసుకుంటున్నారు. ఆ తర్వాత కలెక్టర్లు ఫైనల్ గా లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేస్తున్నారు. రెండో దశలో శనివారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. 2.08 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇందులో 1.05 లక్షల మంది సర్వే పూర్తి చేసి కలెక్టర్లకు ఎంపీడీవోలు లిస్ట్ ను పంపించారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆమోదించగానే ఈ నెల12 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
ఈనెలాఖరుకు ప్రారంభం
తొలి దశలో భాగంగా ఈ ఏడాది జనవరి 26 రాష్ర్ట ప్రభుత్వం మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71 వేల మందికి ఇండ్లను మంజూరు చేసింది. సర్వేలో 6 వేల మంది అనర్హులుగా తేలగా వారిని లిస్ట్ నుంచి తొలగించారు. మిగతా 65 వేల మందిలో ఇప్పటి వరకు 47 వేల లబ్ధిదారులకు కలెక్టర్లు ఇండ్లను సాంక్షన్ చేశారు. రీసర్వే పూర్తి అవుతున్నందున మిగతా వారికి కూడా త్వరలో కలెక్టర్లు ఇండ్లను సాంక్షన్ చేయనున్నారు.
స్టేట్ వైడ్ గా ఇప్పటిదాకా 100 మంది బేస్ మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్ పూర్తి చేశారు. నున్నారు. ఈ నెలాఖరుకు మరో కొంత మంది స్లాబ్ పూర్తి చేయనున్నారని హౌసింగ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నెల చివరలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.