45 డిమాండ్లకు సర్కార్ ఒకే..ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు

45 డిమాండ్లకు సర్కార్ ఒకే..ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు
  • ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు
  • ఆర్థికభారం లేనివి ముందుగా అమలు చేయాలని యోచన
  • మిగతా 12 డిమాండ్లు దశలవారీగా అమలు 
  • త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక

హైదరాబాద్, వెలుగు: సర్కార్ ముందు ఉద్యోగుల జేఏసీ ఉంచిన 57 డిమాండ్లలో ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను తొలుత అమలు చేయనున్నట్టు తెలిసింది. ఆర్థిక భారం పడే 12 డిమాండ్లను మాత్రం దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీనియర్ ​ఐఏఎస్ ​నవీన్ ​మిట్టల్​ ఆధ్వర్యంలో ఏర్పాటైన 
త్రిసభ్య కమిటీ.. ఉద్యోగుల డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది. ఆర్థిక భారం లేనివి, ఆర్థిక భారం పడే డిమాండ్లను వేర్వేరు చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది. త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్​రెడ్డికి అందించనున్నట్టు తెలిసింది.  ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి, రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో సర్కారు ఈ నెల 6న త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా, పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్‌‌‌‌‌‌‌‌కుమార్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెంబర్లుగా నియమించింది. 

ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి, వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో ఆ మరుసటిరోజే ఉద్యోగుల జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు సహా 56 సంఘాల నుంచి 46 మంది నాయకులు కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 57 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వాటి ఆధారంగా కసరత్తు చేసిన కమిటీ.. 57 డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది.

 ఎలాంటి ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను ఒక కేటగిరీలో.. వేతన సవరణ (పీఆర్సీ), పెండింగ్​డీఏలు, పాత పెన్షన్ స్కీమ్ అమలు , రిటైర్మెంట్​బెనిఫిట్స్ చెల్లింపు, రాయితీలు, గృహ నిర్మాణ సౌకర్యాలు వంటి 12 కీలక డిమాండ్లను మరో కేటగిరీలో చేర్చినట్టు తెలిసింది. ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక ఒకట్రెండు రోజుల్లో సీఎం రేవంత్​రెడ్డికి త్రిసభ్య కమిటీ తమ రిపోర్టును అందజేసే అవకాశముంది. కాగా, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆర్థిక భారం లేని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ఆర్థిక భారం పడే డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశముందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

ఒకట్రెండు డీఏలు ఇచ్చే చాన్స్.. 

గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులు, స్కీములకు, జీతాలకు ప్రతి నెలా రూ.22 వేల కోట్లు అవసరమవుతున్నాయని.. కానీ రూ.18వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నందున ప్రతి నెలా రూ. 4వేల కోట్ల లోటు ఉంటోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తిచేశారు. ఈ క్రమంలో ఆర్థిక భారం పడే ఉద్యోగుల డిమాండ్లను దశలవారీగా పరిష్కరించే అవకాశముందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు రోడ్​ మ్యాప్​రెడీ చేస్తున్నారు. సర్కార్ బాకీ పడిన ఐదు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదు డీఏలు అమలుచేయడం సాధ్యం కానందున ప్రస్తుతం ఒకట్రెండు డీఏలను రిలీజ్​చేయనున్నట్లు తెలిసింది. 51 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వాలనే ఉద్యోగుల డిమాండ్​కూడా ఆర్థికంగా భారం పడేదే. దీంతోపాటు  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్​(సీపీఎస్​) రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్​గా ఉంది. కాంగ్రెస్​పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓపీఎస్​అమలుకు ఉద్యోగులు డిమాండ్​చేస్తున్నారు. 

ఈ డిమాండ్​అమలుతో ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నా.. దీని అమలు వల్ల రాష్ట్రంపై ఆర్థికభారం తప్పదన్నది నిపుణుల వాదన. దీంతో ఈ డిమాండ్ల పై రాష్ట్ర సర్కార్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు టీజీఎస్‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీ సహా కొన్ని విభాగాల ఉద్యోగులు 2017 వేతన సవరణ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత నెలలోపు టెర్మినల్ లీవ్ ఎన్‌‌‌‌‌‌‌‌క్యాష్‌‌‌‌‌‌‌‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలనే డిమాండ్​ఉంది. ప్రస్తుతం రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​బెనిఫిట్స్​చేతికందాలంటే ఏడాది, రెండేండ్లకు పైనే పడుతున్నది. దీంతో  కనీసం మూడు లేదా ఆరు నెలల్లోపు అన్ని రకాల బెనిఫిట్స్​అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశమున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

రెండు డీఏలకు 600 కోట్లు అవసరం.. 
 
ప్రస్తుతం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఐదు డీఏల్లో రెండు రిలీజ్​చేసినా దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయి. ఇక ఐదు డీఏలు ఇవ్వాలంటే కనీసం రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి. ప్రభుత్వం గతేడాది ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్ విషయానికొస్తే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. 20 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్​ఇచ్చినా ఏడాదికి కనీసం రూ.5 వేల కోట్లు అవసరం కానున్నాయి. గతంలో అంటే 2021లో 30 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్​ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు రూ.7 వేల కోట్లు ఆర్థిక భారం పడింది. కాగా, రాష్ట్రంలో మొత్తం దాదాపు 9.17 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు.