జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత BRS ఖాళీ.. దొంగ ఓట్లు అనేది ఫేక్ ప్రచారం : మంత్రులు వివేక్, పొన్నం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత BRS ఖాళీ.. దొంగ ఓట్లు అనేది ఫేక్ ప్రచారం : మంత్రులు వివేక్, పొన్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (అక్టోబర్ 14) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగల్ రావు నగర్ డివిజన్‎లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అభ్యర్థి నవీన్ యాదవ్, పలు కార్పొరేషన్ల చైర్మన్ల హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్‎ను గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారని అన్నారు. మనం ఇప్పటికే 5 శాతం మెజార్టీలో ఉన్నామని.. ఇంకా 15 శాతం ముందుకు వెళ్లాలన్నారు. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పర్ఫెక్ట్ పని చేస్తే జూబ్లీహిల్స్‎లో మనం విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మనం అందరిని కలుపుకోని ముందుకు వెళ్లాలని.. చిన్న చిన్న సమస్యలకు బాధపడొద్దని సూచించారు. 

మేము ముగ్గురం ఇంచార్జ్ మంత్రులం ఉన్నాం.. ఇంకొందరు మంత్రులు కూడా వస్తారని చెప్పారు. గతంలో సారు కారు 16 అన్నారు.. కానీ ఏమైందో మీకందరికి తెలుసు.. ఇక జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ మొత్తమే కనిపించదని అన్నారు. రాష్ట్రంలో గతంలో రావణాసురిడి పాలన ఉండేదని.. ఇప్పుడు ప్రజా పాలన నడుస్తోందన్నారు. జూబ్లీహిల్స్‎లో దొంగ ఓట్లు లేవని.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కృత్రిమ ఏడుపులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడవాలని కేటీఆర్, హరీష్ సునీతను రెచ్చగొడుతున్నారని.. రాజకీయ వేదికలపై ఏడవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సునీతపై మాకు సానుభూతి ఉంది కానీ కేటీఆర్, హరీష్ తమ రాజకీయాల కోసం ఆమెను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో దెబ్బ కొడితే బీఆర్ఎస్‎కు గువ్వు గుయ్యుమన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని.. బీఆర్ఎస్ పార్టీనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.