
స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే మంజూరు చేసింది. అయితే, రిజర్వేషన్ల మీద మాత్రమే హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఎన్నికల మీద కాదు. ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఈ స్టేని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టులో ఏమైనా రిలీఫ్ (ఉపశమనం) వస్తుందా అనే విషయంలో న్యాయ నిపుణులకు అనుమానం ఉంది. ఏమైనా రిలీఫ్ వస్తుందని ప్రభుత్వం భావిస్తుందా? ఇలాంటి సందేహాలు ఎన్నో..! ఈ జీవో కోర్టుల్లో నిలిచే అవకాశం ఉందని ప్రభుత్వం భరోసాతో ఉందా? లేదా మేం బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నమా? అన్ని రాజకీయ పక్షాలు బీసీలకు రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నాయా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీటికి సమాధానాలు అన్వేషిద్దాం.
ఈ రిజర్వేషన్ల గురించి, ఈ జీవో గురించి, దాని చట్టబద్ధత గురించి అర్థం చేసుకోవాలంటే మన రాష్ట్ర హైకోర్టులో జరిగిన వాదనలని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే సరిపోతుంది. అమలుకు సాధ్యంకాని ఈ జీవో వల్ల బీసీలలో అనవసర భ్రమలు ఏర్పడినాయి. బీసీలకు, ఓసీలకు మధ్య అనవసర వైషమ్యాలు పెరిగే అవకాశం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు? ఈ జీవో అమలు కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
రాష్ట్ర హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డా. ఎఎం సింఘ్వీ చేసిన వాదనలను ముందుగా పరిశీలిద్దాం. ఈ చట్టాన్ని అన్ని రాజకీయ పక్షాలు, తమ రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్ర లెజిస్లేచర్‌లో ఆమోదించాయి. అందుకని ఇలాంటి విషయాల్లో న్యాయ సమీక్షని తక్కువగా ఉపయోగించాలి.
50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందా. .?
జీవోలను, నోటిఫికేషన్లని మాత్రమే సవాలు చేశారు. కానీ, చట్టాన్ని సవాలు చేయలేదు. అంతేకాదు ఇలా జీవోని ప్రభుత్వం జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కూడా సవాలు చేయలేదు. రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా రాజ్యాంగంలో ఎలాంటి నిషేధం లేదు. ఈ 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల్లో చెప్పిందని, అందుకని ఈ జీవోలు, నోటిఫికేషన్లు చట్టబద్ధమని అందుకని స్టే ఇవ్వకూడదని హైకోర్టు ముందు వాదనలు చేశారు.
ప్రభుత్వం సరైన విచారణ జరిపి అవసరమైన ఎంపిరికల్ డేటాని సేకరించిన తరువాత మాత్రమే ఈ జీవోలను తదనుగుణంగా నోటిఫికేషన్లు మంజూరు చేశారని కోర్టుకి విన్నవించారు. 42శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర లెజిస్లేచర్17 మార్చి 2025 రోజున ఏకగ్రీవంగా ఆమోదించినదని, అది గవర్నరుకి 22 మార్చి 2025 రోజున ఆమోదం కోసం పంపించారని అందుకని అది చట్టరూపం దాల్చినట్టుగా భావించాలని కూడా చెప్పారు.
ఇందుకోసం ఆయన స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు (2025. 8 ఎస్సిసి1) కేసుని ఉదహరించారు. అదేవిధంగా సె.285 ఎ ని సవరిస్తూ 10–7–2025 ఆర్డినెన్సును ప్రభుత్వం జారీ చేసిన తరువాత డేటాని పరిగణనలోకి తీసుకుని 26–9–25 రోజున ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్లు 9, 41, 42లని జారీ చేసిందని చెప్పారు.
ఇందిరా సహానీ కేసులో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండవచ్చని జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2023 (5) ఎస్ఎస్సి.1)లో చెప్పినారని అందుకని ప్రాథమికంగా చూసినప్పుడు స్టే మంజూరు చేసే అవకాశం లేదని ఆయన రాష్ట్ర హైకోర్టుకు విన్నవించారు. ఈ వాదనలని స్వీకరిస్తూ కొన్ని అదనపు విషయాలను, వాదనలను హైకోర్టు ముందు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చేశారు.
సర్వే నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు
రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం మేరకు సమగ్ర సాంఘిక, ఆర్థిక సర్వే రాష్ట్రంలో 60 రోజులపాటు జరిగిందని ఆ సర్వే నివేదికను ఆధారం చేసుకుని 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించామని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అందుకని దాని పబ్లికేషన్ అవసరం లేదని వాదించారు. ప్రొఫెసర్ రవివర్మ కుమార్ కూడా ప్రభుత్వం తరఫున తన వాదనలను కొనసాగించారు. ఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ఆఫ్ మైసూర్(ఏఐఆర్ 1963 సుప్రీంకోర్టు 649) కేసు ఈ 50శాతం రిజర్వేషన్లకి పునాది అని అందులో కూడా 50శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పలేదని కోర్టుకు విన్నవించారు.
రిజర్వేషన్ల బిల్లుని అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయి. నిజమే! వారివారి ప్రయోజనాల కోసం అవి ఆమోదించాయి. కానీ, అది చట్టరూపం దాల్చలేదు. అది బిల్లు రూపంలోనే ఉంది. స్టేట్ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు తీర్పు ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో తిరిగి సంప్రదించిన తరువాత బిల్లుని గవర్నర్‌కి సమర్పించినప్పుడు గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపాలి.
బిల్లు భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన తన ఆమోదాన్ని తిరస్కరించవచ్చు. బిల్లులను పరిశీలించేటప్పుడు గవర్నర్లు తమ ఆమోదాల్ని నిలిపివేయడానికి ఒక నెల, రాష్ట్ర మంత్రివర్గ సలహాకు విరుద్ధంగా ఉంటే మూడు నెలలు, పున: పరిశీలన తరువాత తిరిగి సమర్పించిన బిల్లులకు ఒక నెల వంటి స్పష్టమైన గడువులను సుప్రీంకోర్టు నిర్దేశించింది.
50శాతం పరిమితి అనేది ఉల్లంఘించలేని నియమం కాదు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చేసింది కాదు. ప్రత్యేక కమిషన్‌ను 27–2–2025 రోజున ఏర్పాటు చేశారు. అది రిపోర్టుని 4–3–2025 రోజున ఇచ్చింది. ఆ రిపోర్టుని రాష్ట్ర కేబినెట్ 6–3–2025 రోజున ఆమోదించింది. జయరాజ్ కేసు ప్రకారం ఈ డేటాని ప్రచురించాలి. అది జరగలేదు. ప్రచురించకుండానే జీవోని జారీ చేశారు. ఈ చర్యలన్నీ వికాశ్ కిషన్‌రావు గవాలి కేసులో చెప్పినదానికి విరుద్ధంగా జరిగినవే. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. ఈ తీర్పుని అధిగమించడానికి పార్లమెంట్ జోక్యం అవసరం ఉంటుంది.
ఇందిరా సహానీ కేసు ఉద్యోగాలకి అదేవిధంగా విద్యాసంస్థలలో రిజర్వేషన్ గురించి ప్రస్తావించింది. అందులో కూడా సుప్రీంకోర్టు 50శాతం పరిమితిని ఏర్పరిచింది. జనహిత్ అభియాన్ కేసు అనేది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినది. అదేవిధంగా ఎంఆర్ బాలాజీ కేసు ప్రకారం 50శాతం పరిమితి అనేది ఉల్లంఘించలేని నియమం కాదు.
అయితే, అది సుదూర ప్రాంతాలలోని రాష్ట్రాలకి అసాధారణ పరిస్థితులలో వర్తిస్తుంది. అయితే, వికాస్ కిషన్‌రావు గవాలి కేసు అనేది ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించినది. ప్రత్యేకంగా ఇది అన్ని రాష్ట్రాలలోని స్థానిక సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించినది.
రాహుల్ రమేష్ వాగ్ కేసుని కూడా మన రాష్ట్ర హైకోర్టు తన ఉత్తర్వులలో ఉదహరించింది. ఆ తీర్పు ప్రకారం స్థానిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని, ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించాలి.
ట్రిపుల్ టెస్ట్‌ని నిర్వహించలేనప్పుడు, ఎన్నికలను చట్టబద్ధమైన కాలానికి మించి వాయిదా లేకపోతే సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషన్ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరి సీట్లుగా ప్రకటించి స్థానికి సంస్థల ఎన్నికలను కొనసాగించాలి.
బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి...రాజకీయ నిబద్ధత. సంకల్పం అవసరం
వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు చెప్పినవిధంగా 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు. జీవో ఎంఎస్ నెం.9 తేదీ 26–9–2025 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 67శాతం రిజర్వేషన్లు ఏర్పరచడం ద్వారా 50శాతం ఉండాల్సిన రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించినారని భావించి స్టేని హైకోర్టు మంజూరు చేసింది. దాంతోపాటుగా జీవో 41, 42లపై కూడా స్టేని హైకోర్టు మంజూరు చేసింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఈ పరిమితిని సుప్రీంకోర్టే మార్చాల్సి ఉంటుంది.
శాసనాలను తయారుచేసే అధికారం ఆర్టికల్ 245 ప్రకారం పార్లమెంటుకి, శాసనసభలకు ఉంది. ‘లా’ ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 141 ప్రకారం ఉంది. సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి కేసులో ఈ రాజకీయ రిజర్వేషన్లకి 50శాతం మించకూడదని ప్రకటించింది. అది దాన్ని వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఈ 50శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు వర్తిస్తాయిని సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఈ రెండు తీర్పులకు భిన్నంగా సుప్రీంకోర్టు భాష్యం చెప్పకపోతే పార్లమెంటు ఆర్టికల్ 245 ప్రకారం తన అధికారాన్ని వినియోగించి శాసనం తీసుకుని రావాలి. అప్పటివరకు ఈ సందిగ్ధం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి కావాల్సింది రాజకీయ నిబద్ధత. సంకల్పం... బీసీ నాయకులు ప్రభుత్వాల మీద ఎలాంటి ఒత్తిళ్లు తీసుకువస్తారో వేచి చూడాలి. అలా ఒత్తిళ్లు తీసుకుని రానప్పుడు ఈ రిజర్వేషన్లు 50శాతం మించకుండానే ఉంటాయి. అందని ద్రాక్షపండ్లుగానే మిగిలిపోతాయి.
రిజర్వేషన్లు రాష్ట్ర శాసనసభ నిర్దేశించాలి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డి, 243టి (6) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్ర శాసనసభ నిర్దేశించాలి. అంతేకానీ ప్రభుత్వం కాదు. ఇక్కడ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. కె.క్రిష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 (7) ఎస్సిసి 202 ప్రకారం రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీల్లేదు. ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగపరమైనవి కాదు. అవి శాసనం ద్వారా వచ్చినవి. ఈ తీర్పుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం ప్రకటించినట్టుగా భావించాల్సి ఉంటుంది.
జీవో ఎంఎస్ నెం.9 ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా రిజర్వేషన్లు 67 శాతం వరకు పెరిగిపోయాయి. ఈ జీవో కన్నా ముందు ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 25శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వికాస్ క్రిష్ణారావు గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2021 (6) ఎస్సిసి 73 ప్రకారం కూడా 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు. ఈ తీర్పు మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో చెప్పిన తీర్పు.
ఈ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మూడు టెస్టులను ప్రకటించింది. అందులో ముఖ్యమైనది 50శాతం రిజర్వేషన్లకి మించడానికి వీల్లేదు. ఎంపిరికల్ డేటా కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్ల నిష్పత్తిని పేర్కొనాలి.
- డా. మంగారి రాజేందర్, కవి, రచయిత-