
బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధముందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. ఓ విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. లేవడం, మేల్కొనడాన్ని సూచిస్తుంది. తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తానికి ప్రకృతికి గల సంబంధం..దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. . .
పురాణాల ప్రకారం బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 48 నిమిషములు ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు.
ఈ సమయంలోనే పక్షుల కిల కిల రాగాలు మొదలవుతాయి. కోడి కూయడం ప్రారంభిస్తుంది. చెట్లు చక్కటి గాలిని ఇస్తాయి. ఈ సయమంలో నే ఆరోజుకు సంబంధించి ముహూర్త ఘడియలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి పతి పేరు పెట్టి.. ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతోంది. ఈ సమయాన్ని సరస్వతీ యానం అని కూడా అంటారు. అందుకే వేద పాఠశాలల్లో ఈ సమయంలోనే బోధిస్తారు.
కాని ప్రస్తుత కాలంలో పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు. నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది.
ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడుమనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉత్సాహం నిండిఉంటుంది.ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.
బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః
తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఆలస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ అథనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం
ఆలస్యంగా లేచే వానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుంటే మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖముండదు కదా..!
తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో ఆరోగ్యంతో నిద్రలేచి సృష్టి-స్థితి-లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకుని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నేరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి.
తెల్లవారు జామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి ప్రతి స్పందించగలుగుతాం అని పండితులు అంటారు . తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.
తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది.. అత్యంత శక్తివంతమైన సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతితో విలీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.
తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగలుగుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి.
మార థాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని స శాస్త్రీయంగా నిరూపించారు.
బ్రహ్మ ముహూర్త సమయంలో గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తతమమైందిగా చెబుతారు. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం, మెదడు ఎంతో శక్తిమంతంగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్త మత, పౌరాణిక, ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటారు. ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. . .
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారం ఆధ్యాత్మికవేత్తల సలహాలతో పాటు పలు ఆధ్మాత్మిక గ్రంథాలు.. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.