
హైదరాబాద్: ఆపరేషన్ కగార్తో అతలాకుతలమైన మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ సరెండర్ అయ్యారు. దాదాపు 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరౌలి పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ రావు ఇటీవల పార్టీ ప్రస్తుత విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఆయుధాలు వీడాలని ఆయన పిలుపునిచ్చారు. మల్లోజుల లేఖ మావోయిస్టు పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన లేఖను పార్టీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయుధాలు వీడి పోరాటాన్ని విరమించాలనేది మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయమని కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోవడంతో పార్టీ నెక్ట్స్ సుప్రీం కమాండర్ రేసులో మల్లోజుల వేణుగోపాల్ ముందు వరుసలో ఉన్నారు.
కానీ తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి నంబాల తర్వాత మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మల్లోజుల అస్త్రసన్యాసం తీసుకుని పోలీసులు ఎదుట లొంగిపోవడం మావోయిస్టు పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. కాగా, మల్లోజుల వేణుగోపాల్ రావు సోదరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు కూడా మావోయిస్టే.
మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతనే. బెంగాల్ ఎన్ కౌంటర్లో కిషన్ జీ చనిపోయారు. కిషన్ జీ భార్య మైనక్క కూడా మావోయిస్టే. ఆమె కూడా ఇటీవలే తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు. ఓ వైపు ఆపరేషన్ కగార్తో దిక్కుతోచని స్థితిలో ఉన్న మావోయిస్టు పార్టీకి.. పార్టీ అగ్రనేతలు కొందరు ఎన్ కౌంటర్లో చనిపోవడం, ఇంకొందరు పోలీసులు ముందు లొంగిపోవడంతో పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.