యాదగిరిగుట్టలో నేత్రపర్వంగా లక్ష్మీనారసింహుడి జయంతి 

యాదగిరిగుట్టలో నేత్రపర్వంగా లక్ష్మీనారసింహుడి జయంతి 
  • నేడు నృసింహ ఆవిర్భావ ఘట్టంతో ముగింపు  

యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నారసింహుడి జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం స్వామికి నిత్య పూజల తర్వాత  ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్ష పుష్పార్చన చేశారు. అనంతరం స్వామిని కాళీయ మర్దన శ్రీకృష్ణ అలంకారంలో వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలతో ముస్తాబు చేశారు.  ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం స్వామికి నిత్య కైంకర్యాల తర్వాత.. నృసింహ మూల మంత్ర హవనం, హనుమద్వాహం నిర్వహించారు. అనంతరం హనుమంతుడి వాహనంపై ఆలయ వీధుల్లో విహరింపజేశారు.

పాతగుట్ట క్షేత్రంలో కూడా  ఘనంగా జరిగాయి. కొండపైన సాంస్కృతిక, సంగీత, భజన, కూచిపూడి ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.  యాదగిరీశుడి జయంతి ఉత్సవాల చివరి రోజైన ఆదివారం నృసింహ జయంతి, ఆవిర్భావ ఘట్టంతో ముగియనున్నాయి.  కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.