- ప్రతీ గ్రామంలో 4 స్థాయి సంఘాల ఏర్పాటు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలు
సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీల పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం స్థాయి సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంచాయతీల్లో స్థాయి సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో పల్లెల్లో అమలు చేసిన ఈ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. గ్రామాల్లో స్థాయి సంఘాలు యాక్టివ్ గా ఉంటే పల్లెలు అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెల్లో స్థాయి సంఘాలు వాటి ఉనికి కోల్పోయాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో స్థాయి సంఘాలను పూర్తిగా రద్దు చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పల్లెల్లో మళ్లీ స్థాయి సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,613 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 613, మెదక్ జిల్లాలో 492, సిద్దిపేట జిల్లాలో 508 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో 4 స్థాయి సంఘాలను ఏర్పాటు చేయించే ప్రక్రియపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లు సైతం ప్రభుత్వానికి పంపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి పంచాయతీ పాలకవర్గాలతో పాటు స్థాయి సంఘాలు కూడా పర్యవేక్షించనున్నాయి.
స్థాయి సంఘాల బాధ్యతలు
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీలో 4 స్థాయి సంఘాలను విభజించనున్నారు. అభివృద్ధి పనుల స్థాయి సంఘం, శానిటేషన్ స్థాయి సంఘం, వీధి దీపాల స్థాయి సంఘం, మొక్కల పెంపకం, పచ్చదనం స్థాయి సంఘం ఏర్పాటు చేయనున్నారు. ఆయా సంఘాల సభ్యులు గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం, పంచాయతీ పాలకవర్గానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం తోపాటు విద్యుత్ పొదుపు, అభివృద్ధి ప్రణాళికల్లో సిఫార్సులు, ప్రజా అవసరాల పనులు, వారసంత (మార్కెట్) తదితర పనుల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ఆయా సంఘాలు పూర్తిస్థాయిలో పనిచేస్తూ పంచాయతీ పాలకవర్గానికి సహాయంగా ఉండాలి.
