- రిక్రూట్ చేసుకుని 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదు
- శాలరీలు అడిగితే.. సరిగా పనిచేస్తలేరని వేధింపులు
- ఏజెన్సీ తీరుపై గ్రీవెన్స్ లో కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు
- మంచిర్యాలలోని ఆర్9ఎస్ సెక్యూరిటీ సంస్థ బాగోతమిది
మంచిర్యాల, వెలుగు : ఔట్ సోర్సింగ్ జాబ్ లను ఏజెన్సీలు అంగడి సరుకుగా మార్చాయి. ఒక్కో పోస్టుకు రూ. లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నాయి. ఆపై జీతాలు ఇవ్వకుండా వేధించి మరి తొలగిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా, కోర్టుల్లోనూ నియామకాలు చేస్తూ ఏజెన్సీలు దందా నడుపుతున్నాయి. ఎంప్యానల్ మెంట్ లేకున్నా మ్యాన్ పవర్ సప్లైకి ఎలా ఆర్డర్స్ ఇస్తున్నారో ఏజెన్సీలకే తెలియాలి. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో పలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఫిర్యాదులు వెళ్లగా కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా ఆర్9ఎస్ ఏజెన్సీ చేసిన మోసాలపై బాధితులు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
రూ. లక్షల్లో వసూళ్లు..
జిల్లాలోని వివిధ కోర్టుల్లో హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, డ్రైవర్ వంటి పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద నియామకాలు చేపట్టారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలోని ఆర్9ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ మ్యాన్ పవర్ ఏజెన్సీ వివిధ కోర్టుల్లో దాదాపు 60 మందిని నియమించింది. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు ఉంటాయని నమ్మించింది. ఒక్కో పోస్టుకు రూ.లక్ష చొప్పున ఏజెన్సీ నిర్వాహకులు వసూలు చేశారు.
ఆ ఏజెన్సీ నియమించినవారు చెన్నూర్ కోర్టులో పది మంది ఉన్నారు. ఏజెన్సీ నిర్వాహకుడు నాగరాజు.. మధ్యవర్తి సంపత్ ద్వారా ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు నగదుగా ఇవ్వగా మరికొందరు ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేశామని, తమ వద్ద ఆధారాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు.
జీతాలు ఇవ్వకుండా వేధింపులు..
చెన్నూర్ కోర్టులో పాగె మానస (అంగ్రాజుపల్లి), గాలిపల్లి సుధ (కిష్టంపేట), మారుపాక మౌనిక(ఎసన్వాయి), మోతే రాజేశ్వరి (ఎసన్వాయి), జిముడ భాగ్య (కొల్లూరు), పాగె లక్ష్మి (అంగ్రాజుపల్లి), వొల్లపు రజిత (ఎల్లక్క పేట), ముజఫర్(మంచిర్యాల), ఆశీర్వాదం (రావులపల్లి), సమ్మన్న (రావులపల్లి) గతేడాది ఏప్రిల్ నుంచి పని చేస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఎలాంటి ఆపాయింట్ మెంట్ ఆర్డర్, ఐడీ కార్డులు ఇవ్వలేదు. జాయిన్ అయినప్పటి నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు. గత నవంబర్ లో ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే చెల్లించారు. పెండింగ్ జీతాలు అడిగితే సరిగా పనిచేయడం లేదని, తొలగిస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో మంచిర్యాల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఎంప్యానల్ మెంట్ లేకుండానే..
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు తప్పనిసరిగా ఎంప్యానల్ మెంట్ ఉండాలి. ఏజెన్సీలు రిక్రూట్ చేసే మ్యాన్ పవర్ సంఖ్యను బట్టి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏజెన్సీలు జీతాలు చెల్లించకపోతే ఆ డిపాజిట్ డబ్బులను జప్తు చేసి ప్రభుత్వమే వేతనాలు ఇస్తుంది. కానీ, ఆర్9ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ ఎంప్యానల్ మెంట్ లిస్టులో లేదు. అయినప్పటికీ ఏకంగా కోర్టుల్లోనే నియామకాలు చేస్తుందంటే ఆ ఏజెన్సీ పరపతి ఏంటో తెలుస్తుంది.
బిల్స్ రాలేదంటూ..
ఆర్9ఎస్ సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా.. జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో తమ సంస్థ ద్వారా 60 మందికి పైగా పని చేస్తున్నార ని నిర్వాహకుడు నాగరాజు తెలిపాడు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్స్ రాకపోవడంతోనే సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించలేద న్నాడు. కోర్టుల్లో మ్యాన్ పవర్ నియామ కానికి ఎంప్యానల్ మెంట్ అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఒక్కో పోస్టుకు రూ.లక్ష ఎందుకు తీసుకుంటు న్నారని ప్రశ్నించగా, అలాంటివి మామూలేనని నాగరాజు పేర్కొన్నాడు. ఇలాంటి ఏజెన్సీపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.!
