- బిద్రెల్లి వద్ద టోల్ గేట్ నిర్మాణం పూర్తి
- కొద్దిరోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్
- ఇప్పటికే దిలావర్పూర్ వద్ద టోల్ వసూలు
నిర్మల్, వెలుగు: బాసర సరస్వతి దేవి దర్శనం మరింత భారం కాబోతోంది. భక్తులకు, సాధారణ జనానికి జేబులకు చిల్లులు పడనున్నాయి. రాష్ట్ర నలుమూలలతోపాటు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది బాసర సరస్వతి దేవి దర్శనానికి నిత్యం కార్లు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి నిర్మల్ జిల్లా భైంసా వరకు 56 కిలోమీటర్ల పొడవుతో ఇటీవల నిర్మించిన నేషనల్ హైవే నంబర్ 161 బీబీ రోడ్డులో ముథోల్ మండలం బిద్రెల్లి వద్ద కొత్తగా టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఈ టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ వసూలు చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో వాహనానికి రూ.100కు తగ్గకుండా టాక్స్ విధించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రెండు టోల్గేట్ల వద్ద రూ.200
మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి భైంసా మీదుగా నిర్మల్ వరకు ఉన్న నేషనల్ హైవే నంబర్ 61పై ఉన్న దిలావర్ పూర్ వద్ద టోల్ ప్లాజా ఉన్న విషయం తెలిసిందే. నిర్మల్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి కారు లేదా ఇతర ఫోర్ వీలర్ వాహనంలో సరస్వతి ఆలయానికి వెళ్లాలంటే ఈ టోల్ ప్లాజా వద్ద రూ.80 టాక్స్ చెల్లించాల్సి వస్తోంది. తాజాగా బిద్రెల్లి వద్ద ఇప్పుడు మరో టోల్ గేట్ఏర్పాటవ్వడంతో వాహనాల్లో వచ్చి దర్శించుకోవాలంటే ఈ రెండు టోల్ ప్లాజాల వద్ద దాదాపు రూ.200 టోల్ టాక్స్‌ను చెల్లించాల్సి వస్తుంది.
సమీపంలోనే ఉన్నా తప్పని భారం
బాసరకు సమీపంలోనే ఉన్న నియోజకవర్గ కేంద్రం ముథోల్, భైంసా వాసులకే కాకుండా సరిహద్దు మహారాష్ట్రలోని నాందేడ్, బోకర్, పాలజ్, కిని, జాల్న, ఔరంగాబాద్ తదితర ప్రాంత వాసులకుఈ టోల్ ప్లాజా అదనపు భారం కాబోతోంది. బాసర వరకే కాకుండా ఈ హైవేపై నిజామాబాద్ జిల్లాకు వెళ్లే వారందరికీ ఈ టోల్ ప్లాజా వద్ద పన్ను పడనుంది.
బాసరను దర్శించుకునేందుకు వచ్చే మహారాష్ట్రలోని నాగపూర్, యవత్మల్, చంద్రాపూర్ తో పాటు ఆదిలాబాద్ జిల్లా వాసులకు నేరడిగొండ, దిలావర్పూర్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు భారం పడుతుండగా.. వాటికి తోడు బిద్రెల్లి టోల్ ప్లాజా అదనపు భారంగా కాబోతోంది.
