- అందరూ కుక్కల గురించే ఆలోచిస్తున్నరు.. కోళ్లు, మేకల
- గురించి ఎందుకు మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా?
- కుక్క కాటుతో జనాలు చనిపోతున్నరు
- స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి
- కుక్కలతో యాక్సిడెంట్లూ అవుతున్నయ్
- కొందరు జడ్జిలు కూడా ప్రమాదాల బారిన పడ్డారని వ్యాఖ్య
- వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ
న్యూఢిల్లీ: కుక్కలు కరవబోతున్నాయా.. లేదా.. అనే విషయాన్ని అవి మన దగ్గరకు వచ్చే దాకా తెలుసుకోలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీధులు, స్కూళ్లు, ఇన్స్టిట్యూషనల్ ఏరియాల వద్ద కుక్కలతో ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈమేరకు కొన్ని కీలక కామెంట్లు చేసింది. వీధికుక్కల అంశంలో వ్యతిరేక, అనుకూల వాదనలతో దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పింది. బాధితులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియను స్పీడప్ చేయాలని సూచించింది. ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) నియమాలు, చట్టాలను పాటించేలా చూడటం కోర్టు పాత్ర అని స్పష్టం చేసింది. రూల్స్ పాటించని రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పెంపుడు కుక్కల మూడ్‌ను అంచనా వేయొచ్చు
వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే.. ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? మనుషుల ప్రవర్తనను మనం ఊహించవచ్చు కానీ, ఒక కుక్క ఎప్పుడు కరుస్తుంది? దాని మూడ్ ఎలా ఉందనే విషయాన్ని ఎవరూ గ్రహించలేరు. పెంపుడు కుక్కల ప్రవర్తనను కొంత అంచనా వేయొచ్చు. కానీ, వీధి కుక్కల విషయంలో అది సాధ్యం కాదు. పిల్లలు, పెద్దలు కుక్క కాటుకు గురవుతున్నారు. రేబిస్ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత తీవ్రమైన అంశం’’అని ధర్మాసనం పేర్కొంది.
కుక్కలను షెల్టర్లలో బంధించొద్దు: కపిల్ సిబల్
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘‘మనుషులు జంతువులతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. కుక్కలను షెల్టర్లలో బంధించడం పరిష్కారం కాదు. కాటేస్తున్న కుక్కలను పట్టుకుని వాటిని స్టెరిలైజ్ చేసి మళ్లీ అక్కడే వదలాలి’’ అని సిబల్ వాదించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం వ్యంగంగా స్పందించింది. ‘‘ బహుశా కుక్కలకు ‘కౌన్సిలింగ్’ ఇవ్వడం ఒక్కటే తక్కువైంది. అలా చేస్తే అవి మళ్లీ కరవవేమో’’ అని వ్యాఖ్యానించింది. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా ఆలయాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్తుంటాను. నన్ను ఎప్పుడూ కుక్కలు కరవలేదు’’ అని పేర్కొనగా.. బెంచ్ స్పందిస్తూ.. ‘‘మీరు అదృష్టవంతులు, కానీ బయట అలా లేదు. కుక్కలు రోడ్లపై వెహికల్స్‌కు అడ్డం వస్తున్నాయి, వెంట పడుతున్నాయి. దీంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొన్నిసార్లు జడ్జిలు కూడా గాయపడ్డారు’’ అని బెంచ్ తెలిపింది.
చిన్నారులను పీక్కు తింటున్నప్పుడు ఎందుకు మాట్లాడరు?: కేంద్రం వాదన
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఒక వర్గం (జంతు ప్రేమికులు) గొంతు వినిపిస్తోంది. కుక్క కాటుకు గురైన జనం గోడు ఎవరికీ వినిపించట్లే దు. కుక్కల పట్ల క్రూరత్వం గురించే తప్ప, చిన్న పిల్లలను పీక్కు తింటున్న వాటి క్రూరత్వం గురించి మాట్లాడట్లేదు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి’ అని మెహతా వాదించారు. అనంతరం బెంచ్ కీలక సూచనలు చేసింది. ‘‘స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ చుట్టూ 8 వారాల్లోగా ఫెన్సింగ్ వేయాలి. హైవేలపై తిరుగుతున్న జంతువులను తొలగించే బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాం” అని స్పష్టం చేసింది.
