- ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ వాళ్లు విహారయాత్ర చేస్తున్నరు
- ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, మధుసూదన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: కాంగ్రెస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్తట్టుకోలేకపోతున్నడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన మాట్లాడి, అసెంబ్లీకి వచ్చి మూడు నిమిషాలు ఉండి వెళ్లిపోయారని విమర్శించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ అధికారం పోయేవరకు ఎందుకు పూర్తి చేయలేక పోయారో చెప్పాలని డిమాండ్‌చేశారు.
2023లో నార్లపూర్ వద్ద ఒక మోటార్ఆన్ చేస్తే.. ఆయన హెలికాప్టర్లో ఇంటికి వెళ్లేసరికి ఆ మోటార్బంద్అయిందన్నారు. ప్రజలు తమను ఎక్కడ మరిచిపోతారోనని ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పనీ పాట లేక ప్రాజెక్టుల పేరుతో విహారయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తల, తోక లేకుండా చేశారని మండిపడ్డారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.57 వేల కోట్లకు పెంచారని, అలాంటప్పుడు రూ.27 వేల కోట్లతో 90 శాతం పనులు ఎలా పూర్తయ్యాయో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో నిద్రలేచి నీళ్ల దోపిడీ అంటున్నరు
అధికారం పోయాక రెండేళ్లు నిద్రపోయిన కేసీఆర్.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో నిద్ర లేచి నీళ్ల దోపిడీ అని మాట్లాడారని ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రెస్ మీట్ పెట్టి, తోలు తీస్తామని చెప్పి.. తీరా అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారన్నారు. కాళేశ్వరం మాదిరిగా కృష్ణానీరు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేయిస్తామనడంతో పారిపోయారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రండి.. మీ విలువైన సూచనలు ఇవ్వండి అని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తుంటే రావడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక శ్రీశైలం నుంచి 4 టీఎంసీలకు బదులు 11 టీఎంసీల నీరు ఆంధ్రకు వెళ్తుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని జగన్ ను కలిసి, రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
