- సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితా పై స్వీకరించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిష్కరించి ఓటర్ జాబితా రూపొందించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటర్ జాబితా తయారీపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలలోని 141 వార్డుల్లో ముసాయిదా ఓటర్ జాబితాపై సోమవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించామన్నారు.
అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల10న మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితాలో చిరునామా ప్రకారం ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లు అన్ని ఒకే వార్డులో వచ్చే విధంగా ఉండాలన్నారు. ఓటర్ జాబితాలో వార్డుల విభజన, మ్యాపింగ్ లాంటివి వార్డ్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, బీజేపీ ప్రతినిధి చల్లమల నరసింహ, హబీద్, బీఆర్‌ఎస్ ప్రతినిధి లవకుశ, సత్యనారాయణ, సీపీఎం ప్రతినిధి గోపి, సీపీఐ నుంచి వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
